మొదటి రౌండ్‌కు రెండు గంటలు

19 May, 2019 09:57 IST|Sakshi
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు

ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కంపులో మొదటి రౌండ్‌ ఫలితం రావడానికి రెండు గంటలకు పైగా పట్టవచ్చని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పేర్కొన్నారు. రెండో రౌండ్‌ నుంచి సమయం తగ్గుతుందన్నారు. నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు 16 రౌండ్లు, జగిత్యాల, కోరుట్లకు 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్‌లకు 14 రౌండ్లు, ఆర్మూర్‌కు 13 రౌండ్లు ఉంటాయన్నారు. కాగా కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం కోసం అభ్యర్థులు మూడు రోజుల ముందుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ నెల 23న కౌటింగ్‌ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

పార్లమెంట్‌ పరిధిలో నిజామాబాద్‌లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు డిచ్‌పల్లిలోని సీఎంసీలో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు జగిత్యాలలో లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అవుతుందని, ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, అదనంగా మరో టేబుల్‌ ఆర్వో కోసం ఉంటుందన్నారు. ఇందుకు గాను పోటీ చేసే అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.

ఇందుకు ఫారం–18 ద్వారా ఏఆర్వోకు దరఖాస్తు చేయాలన్నారు. నిజామాబాద్‌కు ప్రత్యేకంగా 36 టేబుళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతి వస్తే ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ రహస్యాన్ని పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌ హాల్‌ లోనికి సెల్‌ఫోన్‌ తనుమతి లేదన్నారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయిన తరువాత ప్రతి నియోజకవర్గం పరిధిలో ర్యాండంగా ఐదు వీవీ ప్యాట్‌లను ఒక దాని తరువాత ఒకటి లెక్కించనున్నట్లు తెలిపారు. మొదట కౌటింగ్‌కు, వీవీప్యాట్‌ కౌటింగ్‌లో తేడా వస్తే, వీవీప్యాట్‌ ఓట్లనే ప్రమాణికంగా తీసుకుంటాన్నా రు. అయితే 2013 నుంచి ఇప్పటి వరకు కౌంటింగ్‌లో ఎలాంటి తేడాలు రాలేదన్నారు. 

పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు అందించాలి– కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు
ఇటీవల నిర్వహించిన నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ రోజు వారి ఖర్చుల వివరాలను వచ్చే జూన్‌ 21వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించడంలో సందేహాలు, సలహాలు తీసుకోవడానికి ఎన్నికల వ్యయ నోడల్‌ అధికారి(జిల్లా సహకార) కార్యాలయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పోటీ చేసిన అభ్యర్థులకు ఈ–ఫైలింగ్‌పై అవగాహన కల్పించడానికి జూన్‌ 15 అవగాహన కార్యక్రమం, 18న ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున అభ్యర్థులందరూ తప్పక హాజరు కావాలన్నారు.

మరిన్ని వార్తలు