ఎండతో పోల్‌ డౌన్‌

12 Apr, 2019 13:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భూపాలపల్లి: గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ములుగు, భూపాలిపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గింది. పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఆశించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి రాకపోవడం, పోలింగ్‌ స్లిప్పులను పంచకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండడం వంటి అంశాలు గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం పడినట్లు తెలిసింది. మహబూబాబాద్‌ ఎంపీ పరి«ధిలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 66.08 శాతం, వరంగల్‌ ఎంపీ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో 52 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది.

పెద్దపల్లి ఎంపీ పరిధిలోని మంథని అసెంబ్లీ సెగ్మెంట్‌లో 58.25 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండూ ఒకే సారి రాకపోవడమే.. రాష్ట్రంలో 2014లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకే సారి నిర్వహించారు. ఈ సారి సీఎం కేసీర్‌ఆర్‌ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి   చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతానికి మించి పోలింగ్‌ నమోదైంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. వరుసగా ఎన్నికలు రావడం కూడా లోక్‌సభ ఎన్నికలపై తీవ్రప్రభావం పడింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారితో పాటు విద్యార్థులు సొంత ఊళ్లకు రావడానికి విముఖత చూపినట్లు సమాచారం. 

భానుడి భగభగ.. 
ఓటింగ్‌ శాతంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. రెండు జిల్లాల్లో ఉదయం ఓటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగానే సాగింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావడానికి జంకారు. దీంతో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో ఓటింగ్‌ శాతం తగ్గింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం 7 గంటల నుంచి నుంచి 11 గంటల వరకే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా తక్కువగా పోలింగ్‌ నమోదైంది. 3 గంటల తర్వాత పోలింగ్‌ ముగిసే వరకు మళ్లీ పోలింగ్‌ ఊపందుకుంది. 

అంతంత మాత్రంగా ప్రచారం..
పల్లెల్లో ఎన్నికల వాతావరణంకనిపించలేదు. గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈసారి మాత్రం గ్రామాల్లో ఆ జోషే లేదు. చాలా వరకు అభ్యర్థుల ప్రచారాలు, రోడ్‌ షోలు పట్టణాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ, నేతలు కానీ కనీసం ప్రచారం కూడా చేయలేదు. దీంతో పల్లెల్లో ఎన్నికల కళ తప్పింది. గత ఎన్నికల్లో ఇంటింటికి వచ్చి ఓటేశారా లేదా అని ఆరా తీసిన నేతలు ప్రస్తుతం మొహం చాటేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర పార్టీల సందడే కనిపించలేదు. 

గ్రామాల్లో కనీసం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. నియోజకవర్గాల పరిధి పెద్దది కావడంతో ఈసారి గ్రామాల్లో కార్యకర్తలను, నేతలను అభ్యర్థులు పట్టించుకోలేదనే వాదన నేతల్లో ఉంది. గడిచిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఈసారి ఆ పరిస్థితి కనపడలేదు. ఇన్ని కారణాలతో కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. 

మరిన్ని వార్తలు