ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నిక

31 May, 2019 17:06 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవం

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఆయనొక్కడే ఉండడంతో.. ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నవీన్‌రావుకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందచేశారు. ప్రకటన అనంతరం గన్‌పార్క్‌ వద్దగల అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ పాల్గొని.. అయనకు అభినందనలు తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్‌కు సభ్యులు తక్కువగా ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు సంపూర్ణమైన మెజార్టీ ఉండడంతో ఎన్నిక జరగకుండానే ఏకగ్రీవంగా ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్‌ స్పష్టంచేశారు. 

మరిన్ని వార్తలు