కొండా వర్సెస్‌ పట్నం

13 May, 2019 12:17 IST|Sakshi

మరో బిగ్‌ ఫైట్‌కు ఉమ్మడి జిల్లా వేదిక కానుంది. హోరాహోరీగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన నెల రోజులకే ఇద్దరు ఉద్ధండులు అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా ఒకరిపై ఒకరు అంతర్గతంగా కారాలుమిరియాలు నూరుతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి.. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడనున్నారు. 

సాక్షి, రంగారెడ్డి: జిల్లాస్థానిక కోటాలో ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ఖరారు చేసింది. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలో దిగనున్నారు. మహేందర్‌ రెడ్డితో ఢీ అంటే ఢీ అనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో.. పట్నంపై పైచేయి సాధించేందుకు కొండా కదన కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామంతో జిల్లా రాజకీయ యవనికపై మరింత ఉత్కంఠ నెలకొంది.

ఆది నుంచి వైరమే.. 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అప్పటి వరకు టీడీపీలో ఉన్న పట్నం మహేందర్‌ రెడ్డి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నం చేరికపై కొండా అయిష్టంగానే ఉన్నారు. 2014 జనరల్‌ ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీసెగ్మెంట్‌ నుంచి గెలుపొందిన పట్నం కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు షురూ మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపడం మొదలయ్యాయి. దీనికితోడు నియోజకవర్గంలో తనను మహేందర్‌ రెడ్డి తిరగనివ్వడం లేదని, తన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని అంతర్గతంగా కొండా సీరియస్‌ కావడానికి ప్రధాన కారణమైంది. ఈ వైరం కాస్త ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో కారుకు గుడ్‌బై చెప్పిన విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తర్వాత గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన పట్నం.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కొండా ప్రధాన అనుచరుడు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

కొండానే ఎందుకు? 
ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు నలుగురి పేర్లు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. వీరు బరిలో దిగేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్లయిన ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోపాటు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లను ప్రభావితం చేయడం కష్టం. అలాగే టీఆర్‌ఎస్‌ ఓటర్ల సంఖ్యా బలం అధికంగా ఉండటంతో.. తమకు ఓటమి తప్పదని వారు భావిస్తున్నారు. పైగా క్యాంపుల నిర్వహణ డబ్బులతో ముడిపడి ఉన్న వ్యవహారం.

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నేతలు పోటీ చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పట్నం మహేందర్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం, తన రాజకీయ శత్రువుగా భావిస్తున్న మహేందర్‌ రెడ్డి అధికార పార్టీ తరఫున బరిలో ఉండడంతో కొండా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో పట్టు ఉండటంతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన.. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారని పార్టీ కూడా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వీలుంది. ఒకవేళ విశ్వేశ్వర్‌రెడ్డి కాకపోతే ఆయన సతీమణి సంగీతారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు