నేడు ఎమ్మెల్సీ పోలింగ్‌

12 Mar, 2019 01:28 IST|Sakshi

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 

అసెంబ్లీలో పోలింగ్‌ నిర్వహణ 

ఐదు స్థానాల గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమా

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఆధ్వర్యంలో పోలింగ్‌ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. ఈ ఎన్నికలను బహిష్కంచాలని కాంగ్రెస్‌ నిర్ణయించడంతో పోలింగ్‌ ఏకపక్షంగానే జరగనుంది.

ఖాళీ అవుతున్న ఐదు స్థానాల కోసం టీఆర్‌ఎస్‌–ఎంఐఎం తరఫున ఐదుగురు, కాంగ్రెస్‌ తరుఫున ఒకరు బరిలో ఉన్నారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున, ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫండీ  పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం టీఆర్‌ఎస్‌–ఎంఐఎం అభ్యర్థుల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీ 120 మంది ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు 91, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీల బలం 15కు పరిమితమైంది. బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలింగ్‌లో పాల్గొనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోలింగ్‌కు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రస్తుత లెక్కల ప్రకారం టీఆర్‌ఎస్‌–ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనం కానుంది.

మరిన్ని వార్తలు