‘పెద్దల’ పోరుకు సై!

8 May, 2019 12:04 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పెద్ద’ల పోరుకు తెరలేచింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికల సంఘం నగారా మోగించింది. ఈ నేపథ్యంలో తాజాగా మండలి బరిలో ఎవరు నిలబడతారనే అంశంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అధికంగానే ఉంది.

శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ స్థానంపై దృష్టిపెట్టారు. ఆయన ఇటీవల ఎంపీగా పోటీచేయాలని భావించినా.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ టికెట్‌ తనకే దక్కుతుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. సోదరుడు నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేయడానికి మహేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు.

అయితే, తాజాగా ఆయన సతీమణి సునీతకు జిల్లా పరిషత్‌ పీఠం కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డి వ్యూహం ఫలిస్తుందా? అన్న చర్చ కూడా పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన కుటుంబీకులకు రెండు పదవులు ఉండడం.. సోదరుడి కుమారుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలబడడం.. ఆయన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
 
‘హస్త’వాసి పరీక్షించుకుంటారా? 
స్థానిక సంస్థల్లో సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్‌కు అత్యధిక సభ్యుల బలం ఉంది. అయితే, 2014 ఎన్నికల అనంతరం ఆపరేషన్‌ ఆకర్‌‡్షకు ఆ పార్టీ కకావికలమైంది. ఈ క్రమంలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఆఖండ విజయం నమోదు చేసింది. దీంతో కాంగ్రెస్‌ బలం తగ్గింది. అయినప్పటికీ, గత ఎన్నికల్లో బరిలో నిలవడం ద్వారా అధికార పార్టీ శిబిరాలు నిర్వహించేలా చేసింది. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్సీ సభ్యుడి పదవీ కాలం 2022 జనవరి 4తో ముగియనుంది. అంటే 31 నెలలు మాత్రమే పదవిలో కొనసాగాల్సి ఉంటుంది.

ఈ స్వల్ప సమయం పదవిలో ఉండేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమించక తప్పదు. పైగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పార్టీ అంతర్మథంలో పడినట్లు తెలిసింది. ఓటర్ల కోసం శిబిరాలు నిర్వహించి అధికార పార్టీని ఢీకొంటామా అనే సందిగ్ధంలో పడినట్లు సమాచారం. అయితే పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దించకపోతే పోటీ ఏకపక్షం కావడంతోపాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్న కోణంలోనూ పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఒకరిని బరిలో ఉంచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు