గులాబీదే హవా.. 

8 Jun, 2019 11:40 IST|Sakshi
చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్‌ను ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : మండల ప్రాదేశిక అధ్యక్ష ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ తిరుగులేని మెజార్టీని సొంతం చేసుకుంది. పోటీ లేకుండా మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. జిల్లాలోని 16 మండలాల అధ్యక్ష స్థానాలుండగా 15 టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వెళ్లాయి. జిల్లాలో మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 178 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్‌ఎస్‌ పార్టీకి 127, కాంగ్రెస్‌కు 44, ఇండిపెండెంట్‌లు ఏడుగురు గెలుపొందారు. ఆయా మండల కేంద్రాల్లో శుక్రవారం ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. క్యాంపుల నుంచి నేరుగా మండల పరిషత్‌ కార్యాలయాలకు ఎంపీటీసీ సభ్యులు చేరుకున్నారు. మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. 16 మండల పరిషత్‌ల్లో 15 టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. జిల్లాలో గీసుకొండ ఒక్కటే కాంగ్రెస్‌కు దక్కింది.

ఉద్రిక్తల నడుమ నర్సంపేట ఎంపీపీ ఎన్నిక
నర్సంపేట మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక ఉద్రిక్తల నడుమ జరిగింది. నర్సంపేట మండల పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా కాంగ్రెస్‌ పార్టీ 6, టీఆర్‌ఎస్‌ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందారు. తన భార్యను కిడ్నాప్‌ చేశారని లక్నెపల్లి ఎంపీటీసీ రజిత భర్త బుచ్చయ్య నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారని పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. సమావేశ ప్రాంతానికి పోలీసులు చేరుకుని రజితను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చారు. రజితను బుచ్చయ్యకు అప్పగించారు. దీంతో వెంటనే అక్కడి నుంచి బయటకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు రోడ్డుపై ధర్నా చేశారు.

ఒకే దగ్గరికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నేలకోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఒకరినొకరు తగవులాడుకున్నారు. కొట్లాటకు దారి తీస్తుండడతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరిని చెదరకోట్టేందుకు లాఠీచార్జీ చేశారు. దీంతో ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. రజిత తన భర్త బుచ్చయ్యతో కలిసి నర్సంపేట మండల పరిషత్‌ కార్యాలయంకు చేరుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు హాజరుకాలేదు. హాజరైన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. ఉద్రిక్తల నడుమ ఎంపీపీ ఎన్నిక జరిగింది. నర్సంపేట ఎంపీపీగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మోతే కమలమ్మ, ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాంజీపేట ఎంపీటీసీ మౌనికను ఎన్నుకున్నారు. నర్సంపేట ఎంపీపీ ఎన్నికను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీఆర్‌ఎస్‌కే దక్కే విధంగా చక్రం తిప్పారు.

మరిన్ని వార్తలు