పార్లమెంటులో ‘జై తెలంగాణ’

19 Jun, 2019 09:20 IST|Sakshi

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం 

సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరిన రెండోరోజు(మంగళవారం) తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 17 మంది సభ్యులకుగాను కిషన్‌రెడ్డి సోమవారమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన 16 మందిలో పది మంది తెలుగులో, నలుగురు ఇంగ్లిష్‌లో, ఒకరు హిందీలో, మరొకరు ఉర్దూ లో ప్రమాణం చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు(బీజేపీ), పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత(టీఆర్‌ఎస్‌) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. జై తెలంగాణ, జైజై భారత్‌ అంటూ ముగించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌(బీజేపీ) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, భారత్‌ మాతా కీ జై అంటూ ముగిం చారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ (బీజేపీ) ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేసి, భారత్‌ మాతా కీ జై అంటూ ముగించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌(టీఆర్‌ఎస్‌) హిందీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి, జై తెలంగాణ అంటూ నినదించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి (టీఆర్‌ఎస్‌) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్‌) తెలుగులో, తన ఫోన్‌లో ఉన్న ప్రమాణ స్వీకార ప్రతిని చదివారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), నల్ల గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కాంగ్రెస్‌) ఇంగ్లిష్‌ లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. భువనగిరి, నాగర్‌కర్నూలు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్‌), పోతుగంటి రాములు (టీఆర్‌ఎస్‌) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. వెంకట్‌రెడ్డి (కాం గ్రెస్‌) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేస్తుండగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి బీజేపీలోకి స్వాగతం అంటూ పిలిచారు. వెంకట్‌రెడ్డి తో మంత్రి కిషన్‌రెడ్డి కరచాలనం చేశారు. వరంగల్లు ఎంపీ పసునూరి దయాకర్‌(టీఆర్‌ఎస్‌), మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత (టీఆర్‌ఎస్‌) తెలుగు లో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు(టీఆర్‌ఎస్‌) తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.  

అసదుద్దీన్‌ రాకతో హోరెత్తిన నినాదాలు 
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు తన స్థానం నుంచి అసదుద్దీన్‌ వస్తుండగా బీజేపీ సభ్యులు బండి సంజయ్‌ కుమార్‌ తదితరులు భారత్‌ మాతా కీ జై, జై శ్రీరాం, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. మరింత గట్టిగా అరవం డి అంటూ అసదుద్దీన్‌ చేతులతో సైగ చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ముగిస్తూ ‘జై భీమ్, జై మీమ్, తక్బీర్‌ అల్లా హో అక్బర్, జై హింద్‌’అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసదుద్దీన్‌ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘నన్ను చూడగానే వారికి ఆ నినాదాలు గుర్తొచ్చినందుకు సంతోషం. వారు రాజ్యాంగాన్ని, ముజఫర్‌పూర్‌ చిన్నారుల మరణాలను కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నా’అంటూ పేర్కొన్నారు.  

తరలివచ్చిన కుటుంబ సభ్యులు, నేతలు 
ప్రమాణ స్వీకారానికి ఎంపీల కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నేత లు తరలివచ్చారు. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యులు, వెంకట్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి గ్యాలరీ నుంచి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆయన తండ్రి డి.శ్రీనివాస్‌ రాజ్యసభ సభ్యుల గ్యాలరీ నుంచి వీక్షించారు. నామా, పోతుగంటి కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, సురేందర్‌రెడ్డి,మాణి క్‌రావు, తదితరులు ఎంపీ బీబీ పాటిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధి లోని నియోజకవర్గ నేతలు భారీగా తరలివచ్చి కొత్త ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు