ప్రాదేశికం.. ప్రతిష్టాత్మకం

22 Apr, 2019 10:07 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈనెల 11న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు ఇంకా సస్పెన్స్‌లోనే ఉండగా.. ఇదే సమయంలో మోగిన ‘ప్రాదేశిక’ ఎన్నికల నగారాతో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో భేటీ అయిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్లాస్‌ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా, జిల్లా పరిషత్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రాదేశిక’ పోరు కోసం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల జాబితాను సేకరిస్తుండగా.. భారతీయ జనతా పార్టీ సైతం కేడర్‌ను సన్నద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా సమావేశాల ద్వారా అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నారు.

గెలుపు గుర్రాల వేటలో అధికార పార్టీ..
జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వె లువడిన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరింత దూకుడు పెంచింది. నిన్న, మొన్నటి వర కు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమిం చిన గులాబీ శ్రేణులను మళ్లీ ఎన్నికలకు సంసిద్ధులను చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం నడుం బి గించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 70 ఎంపీపీ, జెడ్పీటీసీ, 702 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆరు జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అధినేత కేసీఆర్‌ నేతలను ఆదేశించారు. ఈ మేరకు మహబూబాబాద్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల ఇన్‌చార్జి బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జనగామ జిల్లా బాధ్యతలను పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కేసీఆర్‌ అప్పగించారు. çఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు.

దీంతో మంత్రి దయాకర్‌రావు ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, కీలక ప్రజాప్రతినిధులతో నాలుగైదు సార్లు సమీక్షలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేశారు. జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్‌తోపాటు 140 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ, 12 ఎంపీపీ స్థానాల ఎంపిక లక్ష్యంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. హన్మకొండ ‘కాకతీయ హరిత’ హోటల్‌లో మూడు రోజులుగా మకాం వేసి ఎంపీటీసీలు మొదలు.. జెడ్పీ చైర్మన్‌ వరకు పోటీ లేకుండా ఏకాభిప్రాయంతో ఒక్కో స్థానం కోసం ఒక్కరే పోటీ చేసేలా ముఖ్యనేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యాదరి బాలమల్లు సైతం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల నేతలను సమన్వయం చేస్తున్నారు. సోమవారం నాటికి ఈ కసరత్తు కొలిక్కిరానుండగా, మంగళవారం అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
 
కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పూర్వ వైభవం పొందాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేతల మధ్యనున్న విభేదాలు ఇంకా చల్లారకపోగా.. కొందరు ప్రజాప్రతినిధులు పార్టీని వీడతారన్న ప్రచారం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వరంగల్‌ టికెట్‌ కోసం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, మంద కృష్ణ తదితరులు ప్రయత్నం చేయగా.. అధిష్టానం దొమ్మాటి సాంబయ్యకే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు కలిసిరాలేదు. పరిషత్‌ ఎన్నికల్లో కుమ్ములాటలు వీడి పార్టీని విజయ తీరాలవైపు నడిపించాలని అధిష్టానం పలువురు సీనియర్లకు సూచించింది.

పార్లమెంట్‌ తర్వాత వచ్చిన ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారగా, ఇద్దరు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ధనసరి సీతక్క గ్రామాలు, మండలాల్లో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలను గెలిపించి పార్టీకి బలం తగ్గలేదని నిరూపించాలని భావిస్తున్నారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీనియర్‌ నాయకులు, డీసీసీ అధ్యక్షులు కొండా మురళీధర్‌రావు, నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి,ఉమ్మడి జిల్లాలోని పలువురు నాయకులు ఇప్పటికే సన్నాహక సమావేశాలను ప్రారంభించారు. ఆ పార్టీ నేతల టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థులను గెలిపించుకునేంత వరకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు.
 
సత్తా చాటేందుకు బీజేపీ సన్నద్ధం..
వరంగల్, మహబూబాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపిన భారతీయ జనతా పార్టీ జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో సత్తా చూపేందుకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను విశ్లేషించేకునేందుకు వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు ఆదరించారని అభిప్రాయపడిన ఆ పార్టీ నేతలు కేడర్‌ పరిషత్‌ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు