నేడు మొదటి విడత నోటిఫికేషన్‌

22 Apr, 2019 10:17 IST|Sakshi

హన్మకొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధిం చి సోమవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఇదే రోజు నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లను మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. గతంలో జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీటీసీల నామినేషన్లు స్వీకరించే వారు. ఈ సారి ఎన్నికల నిర్వహణలో మార్పు తీసుకువచ్చారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రంలో జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరిస్తారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 7 మండలాల్లో 86 ఎంపీటీసీ స్థానాలకు 7 జెడ్పీటీసీలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2,24,188 మంది ఓటర్లకుగాను 457 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మే 6న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది.

నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్ల ఏర్పాటు
ఎంపీటీసీల నామినేషన్లు ఈ సారి క్లస్టర్ల వారిగా స్వీకరించనున్నారు. గతంలో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించే వారు. నామినేషన్ల ప్రక్రియ సులువుగా కొనసాగేందుకు క్లస్టర్లుగా విభజించింది. ప్రతి మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్‌ చొప్పున ఏర్పాటు చేశారు. ఈ సారి ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేసే సౌకర్యాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కల్పించింది. అయితే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నేరుగా నామినేషన్‌ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది.

మొదటి విడత ఎన్నికల క్లస్టర్లు
హసన్‌పర్తి మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాలకు మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎల్కతుర్తిలోని 12 ఎంపీటీసీలకు 4, కమలాపూర్‌లోని 18 ఎంపీటీసీలకు 6, భీమదేవరపల్లిలో 13 ఎంపీటీసీలకు 5 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ప్రతి మండలంలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి, ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్, ముగ్గులు పంచాయతీ కార్యదర్ళులు, ఒక ఆఫీస్‌ సబార్టినేట్‌ను నియమించారు.  

మరిన్ని వార్తలు