ముఖ్య నేతల ముందే గొడవకు దిగిన కార్యకర్తలు

4 Jan, 2020 17:04 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, సలీం హమద్, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప రెడ్డి, భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ముఖ్య నాయకుల ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జనగాంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జనగాం ప్రాంత కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది.

కుట్రలో భాగంగానే టీఆర్‌ఎస్‌ అలా చేస్తోంది : ఉత్తమ్‌
సాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్‌, నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్‌రెడ్డి, సీనియర్‌ నాయకుడు జానారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. అందులో భాగంగానే మున్సిపల్ చైర్మన్‌, కౌన్సిలర్ల రిజర్వేషన్లను వెంటవెంటనే ప్రకటిస్తోందని ఉత్తమ్‌ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పక్షాన కోర్టులో కేసు వేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ బయపడదని అన్నారు. పౌరసత్వ బిల్లు అమలు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు