33% బీసీ కోటా

6 Jan, 2020 02:23 IST|Sakshi

136 పురపాలికల చైర్మన్, మేయర్‌ స్థానాలకు మున్సిపల్‌ రిజర్వేషన్ల ప్రకటన

40 చైర్‌పర్సన్, 4 మేయర్‌ స్థానాలు

ఎస్సీలకు 17 చైర్‌పర్సన్‌ స్థానాలు (14%), ఒక మేయర్‌ (8%)..

ఎస్టీలకు 4 చైర్‌పర్సన్‌ స్థానాలు (3.2%), ఒక మేయర్‌ (8%)

ఈసారి ఓసీ మహిళకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి

జిల్లాల్లో వార్డులు, డివిజన్లవారీగా రిజర్వేషన్లు ప్రకటించిన కలెక్టర్లు  

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్, 13 మున్సి పల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ఆదివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. 123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్‌కాగా ఓపెన్‌ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి.

13 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్‌ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్‌ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది.

గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా ముగియలేదు. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. మరోవైపు ఆదివారం జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండగా, 22న పోలింగ్‌ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించనున్నారు.

జనాభా దామాషా ప్రకారం..
మున్సిపల్‌ చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాలకు రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం చైర్‌పర్సన్, మేయర్‌ స్థానాలను కేటాయించారు. మున్సిపాలిటీల్లో 3.3 శాతం ఎస్టీ జనాభా ఉండగా, 3.2 శాతం చైర్‌పర్సన్‌ స్థానాలు వారికి దక్కాయి. దీంతో మొత్తం 123 పురపాలికలకుగాను 4 చైర్‌పర్సన్‌ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లో 13 శాతం ఎస్సీల జనాభా ఉండగా దాదాపు 14 శాతం (17 స్థానాలు) చైర్‌పర్సన్‌ సీట్లను వారికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కోటా కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా బీసీలకు 32.5 నుంచి 33 శాతం (40 స్థానాలు) చైర్‌పర్సన్‌ సీట్లను కేటాయించినట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎస్టీల జనాభా 1.9 శాతం మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి ఒక మేయర్‌ పదవి (8 శాతం)ని కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్సీల జనాభా 3.6 శాతం ఉండగా వారికి కూడా నిబంధనల ప్రకారం ఒక మేయర్‌ సీటును కేటాయించడంతో 8 శాతం కోటా అమలు చేసినట్లు అయింది. బీసీలకు 4 మేయర్‌ స్థానాలు కేటాయించడంతో 33 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించినట్లు అయిందని శ్రీదేవి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో మేయర్‌ పదవి రిజర్వు కావడంతో ఈ స్థానాలకు మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేకపోయామన్నారు. అందుకు బదులుగా మహిళలకు ఓపెన్‌ కెటగిరీలో ఉన్న 7 మేయర్‌ స్థానాలకుగాను 4 స్థానాలను రిజర్వు చేశామన్నారు.

మున్సిపాలిటీ చైర్మన్‌ రిజర్వేషన్లు...
బీసీ (జనరల్‌): నారాయణ్‌ఖేడ్, ఆందోల్‌–జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్‌
బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్‌పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్‌

ఎస్సీ (జనరల్‌): క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్‌చర్ల, తొర్రూరు, నర్సింగి
ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి

ఎస్టీ (జనరల్‌): ఆమనగల్, డోర్నకల్‌
ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ

ఓసీ (జనరల్‌): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్, కల్వకుర్తి, షాద్‌నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్‌పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ.
ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్‌ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్‌నగర్, హుజూరాబాద్, శంకర్‌పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్‌కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి

మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ రిజర్వేషన్లు
ఎస్సీ (జనరల్‌): రామగుండం
ఎస్టీ (జనరల్‌): మీర్‌పేట
బీసీ (జనరల్‌): బండ్లగూడ జాగీర్, వరంగల్‌
బీసీ (మహిళ): జవహర్‌నగర్, నిజామాబాద్‌
ఓసీ (జనరల్‌): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ
ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్‌పేట్, జీహెచ్‌ఎంసీ

మహిళలకు..50%
123 మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల చైర్మన్‌ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్‌ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్‌ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్‌పర్సన్‌ స్థానాల్లో బీసీ (జనరల్‌)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్‌)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్‌)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్‌ కేటగిరీ (జనరల్‌)కి 31, ఓపెన్‌ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్‌ స్థానాలకుగాను బీసీ (జనరల్‌)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్‌)కు 1, ఎస్టీ (జనరల్‌)కు 1, ఓపెన్‌ కేటగిరీ (జనరల్‌)కి 3, ఓపెన్‌ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానం ఓపెన్‌ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు