రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..!

25 Jan, 2020 18:52 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ స్పష్టమైన గెలుపునందుకుని పరుగులు పెడుతుండగా.. నిజామాబాద్‌లో మరోసారి కమలం వికసించింది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 28 చోట్ల విజయం సాధించారు. అయితే, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ తప్పలేదు.

ఎంఐఎం 16, టీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ రెండు, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. కాంగ్రెస్‌, స్వతంత్రులతో కలిసి బీజేపీ, ఎంఐఎం, ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి టీఆర్‌ఎస్‌ మేయర్‌ పదవిని సొంతం చేసుకుంటామని ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. రాజకీయం రసవత్తరంగా మారడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాయి. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. 

మేయర్‌ స్థానాన్ని ఆశించారు.. కానీ,
కౌటింగ్‌ ప్రక్రియ మొదలవగానే ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్‌ క్రమంగా వెనుకబడింది.  టీఆర్‌ఎస్‌ గెలుస్తుందనుకున్న చివరి నాలుగు స్థానాలను అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ నుంచి మేయర్‌ స్థానాన్ని ఆశించిన అభ్యర్థులు భంగపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేత, తాజా మాజీ మేయర్‌ ఆకుల సుజాత కూడా ఓటమిపాలయ్యారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయీం ఓడిపోయారు. 

మరిన్ని వార్తలు