తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

19 Feb, 2019 19:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖలు కేటాయించారు. సీనియర్‌ నేత కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖలు కేటాయించగా, మరో సీనియర్‌ నేత ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖలు అలాట్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవమరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి వైద్యారోగ్యశాఖ దక్కగా.. గతంలో విద్యుత్‌శాఖ మంత్రిగా వ్యవహరించిన జగదీశ్‌రెడ్డికి ఈసారి విద్యాశాఖ లభించింది. గత హయంలోనూ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌కు పశుసంవర్థకశాఖ కేటాయించారు.

ఇక, తొలిసారి మంత్రి పదవి నిర్వహిస్తున్న వారిలో నిరంజన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు, ప్రశాంత్‌రెడ్డికి రోడ్లు-భవనాలు, రవాణాశాఖలు కేటాయించారు. మేడ్చల్‌ మల్లారెడ్డికి కార్మిక శాఖ దక్కగా.. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్‌, పర్యాటక శాఖలు లభించాయి. తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో భాగంగా పదిమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమలు, పట్టాణాభివృద్ధి వంటి శాఖలను కేసీఆర్‌ తనవద్దే ఉంచుకోవడం గమనార్హం. గత హయాంలో తన తనయుడు కేటీఆర్‌ నిర్వహించిన ఐటీ, పట్టాణాభివృద్ధి శాఖలను, హరీశ్‌రావు నిర్వహించిన సాగునీటి పారుదల శాఖను కేసీఆర్‌ ఎవరికీ కేటాయించలేదు.

మరిన్ని వార్తలు