కువైట్‌లో తెలంగాణ వాసుల నానా పాట్లు !

31 Jan, 2018 17:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గల్ఫ దేశమైన కువైట్‌లో తెలంగాణవాసులు యాభైవేల మందికిపైగా నానా ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆ దేశ రాయబార కార్యాలయం వద్ద వారు పడిగాపులు పడుతూ.. స్వదేశం వచ్చేందుకు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి.. వారికి సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  

కువైట్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి.. అక్కడి తెలంగాణ వారిని ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. వారికి ప్రభుత్వమే ఉపాధి.. పునరావాసం కల్పించాలన్నారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలు జల్సాలకు .. బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని దుయ్యబట్టారు. ఎందుకు ప్రభుత్వం ఎన్నారై పాలసీ రూపొందించడంలో జాప్యం చేస్తోందని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల కోసం సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని, గల్ఫ్ వెళ్లే వారికి బ్యాంక్స్ నుంచి ఋణం ఇప్పించాలని అభ్యర్థించారు. గల్ఫ్ కార్మికుల కోసం సర్కార్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పీసీసీ నుంచి ఒక బృందం బాధితులకు సాయం అందించేందుకు గల్ఫ్ వెళ్ళనుందని, గల్ఫ్ బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశామని తెలిపారు.

మరిన్ని వార్తలు