టికెట్లెవరికో?

26 Sep, 2018 08:11 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ కేడర్‌లో అయోమయం

ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై బీజేపీ  కసరత్తు  

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  జిల్లాలో రెండు సిట్టింగ్‌ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా ...పెండింగ్‌లో పెట్టటంపై పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్థులను ప్రకటించి ముందస్తు పోరుకు సిద్ధం కాగా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌ సీపీ, మహాకూటమి, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ మేడ్చల్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాల్లో వారం రోజుల వ్యవధిలో అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయా నియోజకవర్గాల  నాయకులతో సమాలోచనలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మళ్లీ అవకాశం కల్పించాలని కోరుతుండగా, మల్కాజిగిరి ఎంపీ సీహెచ్‌ మల్లారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్క ప్రభాకర్‌గౌడ్, సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. అయితే..కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా టికెట్‌ కోసం లోపాయికారీగా మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  మల్కాజిగిరి సీటుపై తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి తనకు, లేదా తమ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికైనా టికెట్‌ ఇవ్వాలని కోరుతుండగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు తనకు కేటాయించాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.

మిగతా పార్టీల్లోనూ  
బీజేపీ ఢిల్లీ అధిష్టానానికి అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర  పార్టీ నివేదించినట్లు జిల్లా పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఉప్పల్‌ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే   ప్రభాకర్,  మేడ్చల్‌ నుంచి  పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపెల్లి మోహన్‌రెడ్డి, కూకట్‌పల్లి నుంచి జిల్లా అ«ధ్యక్షుడు మాధవరం కాంతారావు, మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ,కుత్బుల్లాపూర్‌ నుంచి పార్టీ ఉపా«ధ్యాక్షుడు ఎస్‌.మాల్లారెడ్డి ఖరారైనట్లు  పార్టీ కేడర్‌లో చర్చ సాగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం జిల్లాలో నిలబెట్టే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తునప్పటికిని, బలమైన అధికార టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు మహా కూటమిలో భాగంగా టీడీపీ,టీజేఎస్,సీపీఐ పార్టీలతో పోత్తులు, సర్దుబాటు వంటి విషయాలపై దృష్టి సారించింది. అయినప్పటికీ కుత్బుల్లాపూర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్,   మేడ్చల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, తోటకూరి జంగయ్య యాదవ్,బి.వెంకటేష్‌ గౌడ్‌  పేర్లు కాంగ్రెస్‌ జాబితాలో ఉన్నట్లు స్థానిక పార్టీ శ్రేణుల్లో  చర్చ సాగుతున్నది. జిల్లాలో  వైఎస్సార్‌సీపీ, మహాకూటమిలో భాగంగా టీడీపీ,టీజేఎస్, సీపీఐలతోపాటు  బీఎల్‌ఎఫ్‌ కూడా  అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు  తెలుస్తున్నది.

మేడ్చల్‌ టికెట్‌పై ఇంకా నిర్ణయించలేదు
మేడ్చల్‌: మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు. మండలంలోని మైసమ్మగూడ నుంచి పూడూర్‌ వరకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మేడ్చల్‌ టికెట్‌ ఆశించిన మాట వాస్తవమేనని అధిష్టానం తనను ఎంపీ గా పోటీ చేయమని సూచించిందని అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని అన్నారు. తనకు మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తే ఆనందపడతానని అన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ గెలుపునకు కృషి చేస్తానని అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కి టికెట్‌ కేటాయింపు విషయంలో తన మద్దతు ఉంటుందని అన్నారు. తాను అధిష్టానం సూచనే మేరకే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని అన్నారు.

మరిన్ని వార్తలు