సయోధ్య లేని కూటమి

28 Nov, 2018 02:51 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: హరీశ్‌రావు

సంగారెడ్డి జోన్‌/పటాన్‌చెరు: మహాకూటమి, ప్రజా కూటమి అంటూ చివరికి ప్రజలే లేని కమిటీగా మిగిలిపోయిందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంగళవారం సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం లో, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హరీశ్‌ మాట్లాడారు. మహాకూటమికి కామన్‌ మినిమం ప్రోగ్రాం లేదని, ఉత్తమ్, కోదండరాం మధ్య సయోధ్య లేదన్నారు. దుబ్బాక, మెదక్‌ల లో టీజేఎస్‌ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు బీఫాంలు ఇచ్చారన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని అడ్డుకుంటామంటున్నారని, తెలంగాణను తిరిగి చీకటి మయం చేస్తారా అని ప్రశ్నించారు. వరంగల్‌లో పోటీ చేస్తున్న రేపూరి ప్రకాశ్‌రెడ్డి మూడు మంత్రి పదవులు టీడీపీకే అని అంటున్నారని, వీటిలో నీళ్ల శాఖ, హోం శాఖ, పరిశ్రమల శాఖను తీసుకుని నీటి శాఖతో ఆంధ్రాకు నీటిని తరలించడం, హోంశాఖ ద్వారా ఓటుకు కోట్లు కేసులో బాబుకు జైలును తప్పించడం, పరిశ్రమ శాఖ ద్వారా సంగారెడ్డి, పటాన్‌చెరు పరిశ్రమలను ఆంధ్రాకు తరలించడమే ఉద్దేశమా అని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదం..
ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్‌లో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అని హరీశ్‌రావు అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయిందనడం తగదన్నారు. నిజామాబాద్‌లో నీళ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ లేదనడం తప్పన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే తమకు హైకమాండ్‌ అని, తమకు బీజేపీ అయినా, కాంగ్రెస్‌ అయినా ఒక్కటేనని పేర్కొన్నారు. టీడీపీతో బీజేపీ దోస్తీ ఉన్న కాలంలోనే సుజనాచౌదరి రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలం గాణపై ప్రేముంటే నాలుగున్నరేళ్ల క్రితమే విభజన హామీలు నెరవేరేవన్నారు. విభజన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. మోదీ అధికారంలోకి రాగానే టీడీపీ చెప్పినట్లు విని 7 మండలాల ను ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. హైకోర్టు విభజన చేయలేదని, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, బయ్యారం గనుల విషయంలో అన్యాయం చేశారన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా