ప్రాదేశిక కౌంటింగ్‌ వాయిదా

25 May, 2019 10:54 IST|Sakshi

సిరిసిల్ల: జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 58 జెడ్పీటీసీ, 650 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6, 10, 14వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌ జిల్లాలో 15 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ, పెద్దపల్లి జిల్లాలో 13 జెడ్పీటీసీ, 138 ఎంపీటీసీ, జగిత్యాల జిల్లాలో 18 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 123 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. ఈ నెల 27న సోమవారం ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వివిధ రాజకీయ పక్షాలు ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ ఉత్తర్వులు 2099/టీఎస్‌ఈసీ–పీఆర్‌2019 తేదీ 24–05–2019 జారీ చేసింది. జూలై 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ఫలితాల కోసం మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు.

>
మరిన్ని వార్తలు