సోనియా, రాహుల్‌లను తప్పుదోవ పట్టించకండి

27 Sep, 2018 05:20 IST|Sakshi

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చండూరు(మునుగోడు): ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్ర నాయకులు కొందరు.. సోనియా, రాహుల్‌ గాంధీలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అలాంటివి మానివేయండి’అని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా చండూరులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. చిన్న తప్పులతో కాంగ్రెస్‌కు దెబ్బ తగిలే అవకాశాలున్నాయన్నారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసుకుని టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరారు.

అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడే నాయకులను గుర్తించి పదవులు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి అలాంటి వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదనతో మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. తనకు షోకాజ్‌ ఎందుకు ఇచ్చారని, సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోతే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని మాట్లాడినందుకు.. తిరిగి మరోసారి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి మాత్రం వివరణ ఇవ్వలేకపోయానన్నారు. తమ బావ మృతిచెందడంతో అంత్యక్రియల్లో బిజీగా గడపడమే కారణమన్నారు.

మరిన్ని వార్తలు