నేటితో ప్రచారం బంద్‌ 

4 May, 2019 07:38 IST|Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. 48 గంటల ముందుగానే  ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పడనుంది. శనివారం సాయంత్రానికి మొదటి విడత ప్రచారం ముగుస్తుంది. మొదటి విడతలో  నవాబ్‌పేట్, భూత్పూర్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, గండీడ్‌ మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. 7 జెడ్పీటీసీ, 78 ఎంపీటీసీ స్థానాలకు 6వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు.

జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది బరిలో ఉండగా ఎంపీటీసీ స్థానాలకు 469 బంది అభ్యర్థులు పోటీలో  నిలిచారు. నేటితో ప్రచారానికి తెర మొదటి విడత ప్రచారానికి శనివారం సాయంత్రంతో సమయం ముగుస్తుంది. గతనెల 22వ తేదీ నుంచి నామినేషన్లు వేయగా 28వ తేదిన ఉపసంహరణ పూర్తయింది. అప్పటినుంచి బరిలో ఉన్న అభ్యర్థులు అప్పటి నుంచి ప్రచారాన్ని ఉదృతం చేశారు. నేటితో ప్రచారం ముగియగానే ఇక ప్రలోభాలపై అభ్యర్థులు దృష్టి పెట్టనున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసేందుకు పక్కా ప్రణాళికలనుసిద్ధం చేసుకుంటున్నారు.
 
26 గ్రామాలు, 66 పీఎస్‌లు  
మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో 26 గ్రామాలు, 66 పోలింగ్‌ స్టేషన్లు సమస్యాత్మక  ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దానికి అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్‌స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 26 సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.
 
గండీడ్‌లో 33 పోలింగ్‌ స్టేషన్లు 
జిల్లాలో మొదటి విడుత జరిగే మండలాల్లో అత్యధికంగా గండీడ్‌ మండలంలో 33 సమస్యాత్మక గ్రామాలు అధికంగా ఉన్నాయి. జడ్చర్లలో 13, నవాబ్‌పేటలో 11, మిడ్జిల్‌లో 8, రాజాపూర్‌లో ఒక్కటి సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. భూత్పూర్, బాలానగర్‌ మండలాల్లో ఒక్కటి కూడా సమస్యాత్మక గ్రామం కాని, పోలింగ్‌ స్టేషన్‌ కాని లేవు. మొదటి విడతలో 78 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 461 పోలింగ్‌స్టేషన్లను గుర్తించారు. వీటిని 257 లోకేషన్లలో ఏర్పాటు చేశారు. ఈ విడుతలో 2,39,012 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా గండీడ్‌లో 108, నవాబ్‌పేట్‌లో 103, అత్యల్పంగా రాజాపూర్‌లో 39 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు.

2,625 పోలింగ్‌ సిబ్బంది
మొదటి విడత కోసం మొత్తం 2,625 పోలింగ్‌ సిబ్బందిని ఎంపిక చేశారు. వారికి ఇదివరకే పోలింగ్‌ శిక్షణను ఇచ్చారు. ఇందులో పీఓలు 461, ఏపీఓలు 461 మంది ఉంటారు. అత్యవసర సమయంలో 1703 మందిని ఉపయోగించుకోనున్నారు.

మరిన్ని వార్తలు