తెలంగాణ సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

9 May, 2019 11:12 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

రాయపర్తి: తెలంగాణ సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. మండలకేంద్రంతోపాటు మండలంలోని మైలారం గ్రామాల్లో రెండోవిడత ప్రచారంలో భాగంగా బుధవారం పర్యటించి జెడ్పీటీసీ అభ్యర్థి రంగు కుమార్, ఎంపీటీసీ అభ్యర్థులు బిల్లా రాధిక, ఐత రాంచందర్‌లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు చేయని విధంగా సంక్షేమ పథకాలను పెడితే అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అందువల్లే తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరాటపడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 365 రోజులు చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకోనున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సచ్చిన శవంతో సమానమని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పెంటబొందలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలో సీఎం కేసీఆర్‌ చెప్పినవారే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మూనావత్‌ నర్సింహానాయక్, గోపాల్‌రావు, జినుగు అనిమిరెడ్డి, బిల్లా సుధీర్‌రెడ్డి, ఆకుల సురేందర్‌రావు, గారె నర్సయ్య, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు