ఓటెత్తారు

11 May, 2019 11:14 IST|Sakshi
శివ్వంపేటలో వృద్ధురాలికి సాయం

సాక్షి, మెదక్‌ : మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలు నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారంలో శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ శాతం 80.85గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 3.11 శాతం, తొలి విడత మండల, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికలతో పోలిస్తే 3.07 శాతం అధికంగా నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఈ నెల 14న తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
 
పురుషులదే పైచేయి

రెండో విడతలో మొత్తం ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 22 మంది బరిలో ఉన్నారు. శివ్వంపేట మండలం చండి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా.. మిగిలిన 59 స్థానాలకు 205 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 337 పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడత ఎన్నికల్లో మహిళలు ఓటెత్తి పైచేయి సాధించగా.. రెండో విడతలో పురుషులు పైచేయి సాధించారు. మలి విడత ఎన్నికల్లో పురుషులు 76,718, మహిళలు 79,505, ఇతరులు ఇద్దరు.. మొత్తం 1,56,225 మంది  ఓటెయ్యాల్సి ఉంది. ఇందులో 1,26,306 మంది మాత్రమే ఓటేశారు. ఓటేసిన వారిలో పురుషులు 63,519, మహిళలు 62,787 మంది ఉన్నారు.

ఫస్ట్‌ నర్సాపూర్‌.. లాస్ట్‌ కొల్చారం
రెండో విడతలో ఎన్నికలు జరిగిన మండలాల్లో పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే నర్సాపూర్‌లో అత్యధికంగా నమోదైంది. 95.39 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. శివ్వంపేట మండలం 83.00, కౌడిపల్లి 81.28, చిలప్‌చెడ్‌ 80.90, వెల్దుర్తి 78.44 శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 76.19 శాతంతో కొల్చారం చివరి స్థానంలో నిలిచింది.

రెండు గంటలకోసారి వెల్లడి
ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా.. పోలింగ్‌ శాతాన్ని అధికారులు రెండు గంటలకోసారి వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు 27.96.. 11 గంటలకు 52.56.. ఒంటి గంటకు 68.00.. మూడు గంటలకు 74.67.. పోలింగ్‌ ముగిసే ఐదు గంటల వరకు 80.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

ఎంపీ, తొలివిడత ప్రాదేశిక పోలింగ్‌ కంటే అధికం
తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 77.78 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. మలి విడతలో 80.85 శాతం నమోదైంది. ఈ లెక్కన 3.07 శాతం అధికంగా పోలింగ్‌ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలో 77.74 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.85 శాతం నమోదైంది. 3.11 శాతం అధికంగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది.

పెద్దగొట్టిముక్లలో స్వల్ప ఘర్షణ
శివ్వంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల పోలింగ్‌ కేంద్రం వద్ద కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌లో స్వతంత్రంగా పోటీచేస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు అలర్ట్‌ అయి చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. 

స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ బాక్సుల తరలింపు
పోలింగ్‌ అనంతరం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య వాహనాల్లో బ్యాలెట్‌ బాక్సులను నర్సాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలం తునికికి తరలించారు. మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలో వాటిని భద్రపరిచారు. స్ట్రాంగ్‌ రూం వద్ద నిరంతర గస్తీ ఉండేలా పోలీస్‌ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

అధికారులు, ప్రజాప్రతినిధుల పరిశీలన
రెండో విడతలో పోలింగ్‌ సరళిని అధికారులు నిశితంగా పర్యవేక్షించారు. పలు పోలింగ్‌ సెంటర్లను సందర్శించారు. శివ్వంపేటలోని పలు పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు వాకాటి కరుణ, వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి పరిశీలించారు. వెల్దుర్తి మండల పరిధిలోని పలు పోలింగ్‌ సెంటర్లను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సందర్శించి పోలింగ్‌ తీరును తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దంపతులు కౌడిపల్లిలో, మాజీమంత్రి సునీతారెడ్డి గోమారంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
14న తుదివిడత పోరు
తొలి, మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ నెల 14న జిల్లాలోని ఎనిమిది మండలాల (తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్‌) పరిధిలో తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.
 

మరిన్ని వార్తలు