ప్రశాంతంగా ముగిసిన రెండోవిడత పోలింగ్‌

11 May, 2019 06:49 IST|Sakshi
హన్వాడలో ఓటరు గుర్తింపు కార్డు చూపిస్తున్న మహిళలు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో రెండోవిడుత ప్రాదేశిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది. మొదటి విడతతో పోల్చితే రెండవ విడతలో ఏకంగా నాలుగు శాతం పోలింగ్‌ పెరిగింది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మొత్తంగా 73.68 శాతం నమోదైంది. మొదటి విడతలో 69.84 శాతం పోలింగ్‌ నమోదుకాగా ఈ సారి 4శాతం పెరిగింది.

7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు..  
రెండోవిడతలో అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీకుంట, మహబూబ్‌నగర్, మూసాపేట, హన్వాడ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 7 జెడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు గాను 318 మంది బరిలో నిలిచారు. ఇందులో జెడ్పీటీసీ స్థానాలకు 30 మంది బరిలో నిలిచారు. ఎంపీటీసీ స్థానాలకు 288 బంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు రాక కొంత మంద కొడిగా కనిపించింది. 9 గంటల తర్వాత 20 శాతం, 9 గం టల నుంచి 11 గంటల వరకు తొలి రెండు గంట లు సాగినట్లుగానే సాఫీగా సాగింది. 11 గంటల తరువాత 40.95 పోలింగ్‌ శాతం నమోదైంది. మ ధ్యాహ్నం 1 గంటలకు 60.19 శాతంగా నిలిచింది.
 
గొడవలకు ఆస్కారం లేకుండా.. 
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగలేదు. చిన్నచిన్న సమస్యలు తప్పా ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తలేదు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వికలాంగులకు తోడుగా  సహాయకులు వచ్చారు. వారి  కోసం ప్రత్యేకంగా వీల్‌ చైర్లను ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో  4 గంటలకు చాలా మంది ఓటర్లు వచ్చారు. 5 గంటలలోపు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వారికి ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో చాలా చోట్ల  సమయం ముగిసినా పోలింగ్‌ కొనసాగింది. మహబూబ్‌నగర్‌ మండలంలోని జైనల్లిపూర్‌లో నూతన వధూవరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
73.68 పోలింగ్‌ 
రెండోవిడత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 73.68 పోలింగ్‌శాతం నమోదైంది. అత్యధికంగా దేవరకద్రలో 76.97 శాతం, అత్యల్పకంగా కోయిలకొండలో 68.14 శాతం, మూసాపేట్‌లో 74.93 శాతం, సీసీకుంటలో 76.14, హన్వాడలో 71.89, మహబూబ్‌నగర్‌లో 75.91 శాతం నమోదైంది
 
ఉదయం 9 గంటలకు  21.4 శాతం 
ఉదయం పోలింగ్‌ మంకొడిగా సాగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 46,416 ఓట్లు పోలవ్వగా 20 శాతం నమోదైంది. 11 గంటలకు 94,661 ఓట్లు పోల్‌ కాగా 40.95 శాతం, మధ్యహ్నం 1 గంటలకు 1,39,147 ఓట్లు పోల్‌ కాగా 60.19 శాతం, 3 గంటలకు 1,55,583 ఓట్లు పోల్‌ కాగా 67.30 శాతం పోలింగ్‌ నమోదైంది. చివరగా 2,30,383  ఓటర్లకు గాను 1,70,338 ఓట్లు పోల్‌ కాగా 73.68  శాతం నమోదైంది. ఇందులో 85,640  పురుష ఓటర్లు, 84.698 మహిళా ఓటర్లు ఉన్నారు.
 
పల్లెల్లో పండగ వాతావరణం  
పోలింగ్‌ జరుగుతున్న పల్లెల్లో పండగ వాతావరణం నెలకుంది. ఎన్నికలు జరగుతున్న గ్రామాల్లో ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో పల్లెల్లోని చౌరస్తాలు మొత్తం జనంతో కిటకిట లాడాయి. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో హద్దును వేశారు. బార్డర్‌ అవతలికి పోటీ చేస్తున్న మద్దతు దారులు పోలింగ్‌పై సూచనలు చేశారు.  

పర్యవేక్షించిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ 
తొలివిడత జరుగుతున్న మండలాల్లో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ స్వయంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. మహబూబ్‌నగర్‌  మండలంలోని మనికొండ, మాచారం, పోతన్‌పల్లి, హన్వాడ మండలంలో పల్లెమోనికాలనీ, మాదరం, అమ్మాపూర్‌తండా, మునిమోక్షం, కోయిల్‌కొండ మండలంలో కొత్తాబాద్, సూరారం, భూర్గుపల్లి, వీరంపల్లి, మల్కపూర్, రాజీవ్‌నగర్‌తాండ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి గుర్తులను సూచించే పట్టిక సక్రమంగా ఉంచారా లేదని పరిశీలించారు. ఇక్కడ పోలింగ్‌í Üసిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్‌ సూచించారు. గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

పోలింగ్‌ సరళిపై మంత్రి ఆరా  
రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పోలింగ్‌ సరళిపై ఆరా తీశారు. సల్లోనిపల్లి, హన్వాడ, అప్పాయిపల్లి, ఓబులాయపల్లి, ధర్మాపూర్‌ గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో మాట్లాడి పోలింగ్‌ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దివిటిపల్లిలో ఓటు వేసేందుకు పంజాబ్‌ రాష్ట్రంలోని బతిండలో నివసిస్తున్న దంపతులను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు