నేడే ‘తొలి’ విడత పోలింగ్‌

6 May, 2019 06:54 IST|Sakshi

సాక్షిప్రతినిధి,ఖమ్మం: తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 6న(నేడు) పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. జిల్లాలోని ఏడు మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనుండగా 7 జెడ్పీటీసీ స్థానాలకు 41మంది అభ్యర్థులు, 112ఎంపీటీసీ స్థానాలకు గాను ముదిగొండ మండలంలోని వల్లభి 1, 2 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 110స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. బందోబస్తుకు పోలీసులు సైతం ఆదివారం మధ్యాహ్నం నుంచే పోలింగ్‌ సిబ్బందితో  తరలివెళ్లారు. గత నెల 22వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయగా 25 వరకు నామినేషన్లు స్వికరించారు.

పోలింగ్‌ జరిగే మండలాలివే.. 
జిల్లాలో 20 మండలాలు ఉండగా తొలి విడతలో 7 మండలాల్లో (కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముది గొండ, నేలకొండపల్లి, సింగరేణి, తిరుమలాయపాలెం)  ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 237పోలింగ్‌ స్టేషన్ల లో 629 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 2,99,363మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,46,897 , మహిళలు 1,52,461మంది. ఇతరులు ఐదుగురు ఉన్నారు. పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను 26 జోన్లుగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు రవాణాకు ఇబ్బందులు లేకుండా 91రూట్లుగా విభజించి 36కార్లు, 23మినీ బస్సులు, 87పెద్ద బస్సులను ఏర్పాటు చేశారు.
     
ప్రలోభాల పర్వం.. 
శనివారం సాయంత్రం 5గంటల వరకే ప్రచారం ముగియడంతో ఆ తర్వాత నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు అనేక మంది  ప్రత్యేకంగా ఓటర్లను కలుసుకొని తమకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూనే ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన.. 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంకలు వేర్వేరుగా సందర్శించారు. కామేపల్లిలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించగా, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లోని కేంద్రాలను జెడ్పీ సీఈఓ ప్రియాంకలు సందర్శించి పలు సూచనలు చేశారు.

>
మరిన్ని వార్తలు