రెండో విడత బరిలో414 మంది

3 May, 2019 10:39 IST|Sakshi

మిర్యాలగూడ : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌లో నిర్వహించనున్న రెండవ విడత నామినేషన్ల ఉపసంహరణ గురువారంతో ముగిసింది. ఏప్రిల్‌ 26వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు గుర్తులు కేటాయించారు. మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని పది మండలాల్లో పది జెడ్పీటీసీలు, 109 ఎంపీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 105 ఎంపీటీసీలకు, పది జెడ్పీటీసీలకు గాను మొత్తం 413 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 105 ఎంపీటీసీల స్థానాలకు గాను 363 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పది జెడ్పీటీసీలకు 51 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.ఈ నెల 10వ తేదీన ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 
నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం
మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో రెండవ విడత ఎన్నికలు నిర్వహించే ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 109 ఎంపీటీసీ స్థానాలకు మిర్యాలగూడ నియోజకవర్గంలో మూడు ఎంపీటీసీలు, నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. నాలుగు ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్లాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ మండలంలో తక్కెళ్లపాడు ఎంపీటీసీగా పాశం హైమావతి (టీఆర్‌ఎస్‌), వెంకటాద్రిపాలెం –1 ఎంపీటీసీగా నూకల సరళ (టీఆర్‌ఎస్‌), ఊట్లపల్లి ఎంపీటీసీగా నకిరేకంటి కళావతి (టీఆర్‌ఎస్‌), నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని తిర్మలగిరి సాగర్‌ మండలంలోని రంగుండ్ల ఎంపీటీసీగా ఆంగోతు అమ్లిలచ్చిరామ్‌నాయక్‌ (టీఆర్‌ఎస్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు