హడలెత్తిస్తున్న తెలంగాణ ఎన్నికల షెడ్యూలు

6 Oct, 2018 16:51 IST|Sakshi

పార్టీలు, అభ్యర్థుల గుండెల్లో గుబులు

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అన్న సస్పెన్స్ కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించినప్పటికీ తాజా నిర్ణయం రాజకీయ పార్టీల నేతలను హడలెత్తిస్తున్నాయి. ఓటర్ల సవరణ, తుది జాబితా ప్రకటనకు సంబంధించిన అంశంపై కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల జాప్యమవుతుందని అంతా భావించారు. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల షెడ్యూలుతో కలపకుండా ఎన్నికల కమిషన్ మరికొంత గడువు తీసుకునే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు. అయితే, ఓటర్ల జాబితాపై తీసుకుంటున్న చర్యలను కమిషన్ హైకోర్టుకు వివరించిన నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకావన్న ఆలోచనతో ఎన్నికల కమిషన్ తెలంగాణ షెడ్యూలును ప్రకటించింది. అయితే, తాజాగా ప్రకటించిన షెడ్యూలు పార్టీల్లో మరీ ముఖ్యంగా పోటీకి దిగుతున్న అభ్యర్థులను మాత్రం హడలెత్తిస్తోంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత సుదీర్ఘ వ్యవధి అనంతరం పోలింగ్ తేదీని ఖరారు చేయడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

సాధారణంగా షెడ్యూలు విడుదలైన తర్వాత వారం నుంచి పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయడం సాధారణంగా జరుగుతోంది. అలాగే నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచి మూడు వారాల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికలకు సంబంధించి  సెప్టెంబర్ 6 వ తేదీన తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజునుంచే ఆయా పార్టీల్లో ఇప్పటికే రాజకీయ వేడి పుంజుకోగా, ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయం మరింత మంట రాజేసినట్టయింది. శనివారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మరో రెండు నెలల తర్వాత పోలింగ్ నిర్వహిస్తారు. షెడ్యూలు ప్రకటించిన 63 రోజులకు పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి నవంబర్ 12 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని, పోలింగ్ డిసెంబర్ 7 వ తేదీన నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన మొత్తంగా రెండు నెలల పాటు ఎన్నికల వాతావరణంగా వాడి వేడి ఉండబోతోంది. అయితే షెడ్యూలుకు పోలింగ్ నకు మధ్య వ్యవధి రెండు నెలలు ఉండటం వల్ల అభ్యర్థుల ఖర్చు తడిసి మోపెడవుతుందని నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రెండు నెలలకుపైగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు వ్యూహాలు, ఎత్తులు ఎత్తుగడల మధ్య కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని టీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గరిష్టంగా నవంబర్ మూడో వారంలో పోలింగ్ పూర్తవుతుందని భావించామని, ఓటర్ల తుది జాబితా వ్యవహారం ఈ రకంగా టర్నవుతుందని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మధ్య సీట్ల సర్దుబాటు తుది అంకానికి రాకపోగా, టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో తమ అనుయాయులతో చర్చలు, సంప్రదింపులను ప్రరంభించడమే కాకుండా జేబులు ఖాళీ చేసుకునే ప్రక్రియ కూడా మొదలైందని కూటమి నేతలు అంటున్నారు. మొత్తంమీద నోటిఫికేషన్ కు పోలింగ్ నకు మధ్య సుదీర్ఘమైన గడువు అభ్యర్థుల ఖర్చులను రెండింతలు అయ్యే ప్రమాదముందని విశ్లేషణలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు