తెలుగువారి దీవెనలే గెలుపుబాట

16 Apr, 2018 03:48 IST|Sakshi

కన్నడనాట నిర్ణయాత్మకంగా తెలుగు ఓటర్లు

బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో బలమైన వర్గం  

సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కన్నడేతరుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. కర్ణాటకలో తెలుగువారితో పాటు తమిళులు, మలయాళీలు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు. బెంగళూరు మహానగరంతోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కన్నడేతరులు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా భాషలు మాట్లాడే ప్రజల ఓట్లు కీలకమని రాజకీయ పార్టీలు భావించి వారిని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇక తెలుగువారి విషయానికొస్తే రియల్‌ ఎస్టేట్, విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బెంగళూరుతో మన వారికి తరతరాల నుంచీ విడదీయలేని బంధముంది. లక్షలాది మంది తెలుగువారు బెంగళూరు వ్యాప్తంగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం నగర పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 10 స్థానాల్లో తెలుగువారు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. హెబ్బాళ, కేఆర్‌ పురం, బొమ్మనహళ్లి, మహదేవపుర, బీటీఎం లేఔట్, అనేకల్, యలహంక, జయనగర, హొసకోటే, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల సంఖ్య అధికం. అలాగే ప్రస్తుత శాసనసభ్యుల్లో దాదాపు 10 శాతం మంది తెలుగు మాట్లాడేవారు ఉండడం గమనార్హం.

కర్ణాటకతో సరిహద్దు బంధం
కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దులున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, వ్యాపార, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కర్ణాటకకు తరలివచ్చారు. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు, చిక్కబళ్లాపుర, మైసూరు, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, యాదగిరి, హుబ్లీ–ధార్వాడ తదితర ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం దాదాపు కోటి మందికిపైగా తెలుగు మాట్లాడే ప్రజలు రాష్ట్రంలో ఉంటున్నారు.

ఎప్పటినుంచో స్థిరపడిపోయిన తెలుగువారు ఇక్కడే తమ అనుబంధాలను ఏర్పరచుకున్నారు. రాష్ట్రంలో కన్నడ తరువాత ఇతర భాషలు మాట్లాడే వారిలో ఉర్దూ తొలిస్థానంలో ఉండగా ఆ తర్వాత తెలుగు నిలిచింది. అక్కడి జనాభాలో ఉర్దూ మాట్లాడేవారు 9 శాతం కాగా, తెలుగు ప్రజలు 8.17 శాతం ఉన్నారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో దగ్గుబాటి పురంధేశ్వరి వంటి తెలుగు నేతలతో బీజేపీ ప్రచారం చేయిస్తోంది. బెంగళూరులోనూ అలనాటి నటుడు కృష్ణంరాజు ఇప్పటికే ఒక విడత ప్రచారంలో పాల్గొన్నారు.

జేడీఎస్‌కు కేసీఆర్, పవన్, కాంగ్రెస్‌కు చిరు
గణనీయ సంఖ్యలో ఉన్న తెలుగు వారి ఓట్లను దక్కించుకునేందుకు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాల పరంగా కాంగ్రెస్, బీజేపీలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఇక్కడ జేడీఎస్‌ అధినేత దేవెగౌడతో సమావేశమైన తెలంగాణ సీఎం  కేసీఆర్‌.. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతివ్వాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ చిరంజీవిని రంగంలోకి దింపనుంది. ఆయన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ జేడీఎస్‌ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలంటున్నారు. పవన్‌కు జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామితో మంచి సంబంధాలు ఉన్నాయి.

‘యోగి అడుగుపెడితే చెప్పులతో కొట్టండి’
బెంగళూరు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కర్ణాటక పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ గుండూరావ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగి ఎప్పుడు రాష్ట్రంలో అడుగుపెట్టినా చెప్పులతో కొట్టా లని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో కఠువా, యూపీలో ఉన్నావ్‌ గ్యాంగ్‌ రేప్‌ బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కర్ణాటక పీసీసీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన నిజంగా యోగి కాదు. గూండా, అబద్ధాల కోరు,  ఇక్కడికి వస్తే ప్రజలు చెప్పులతో కొట్టి వెనక్కుపంపాలి’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

>
మరిన్ని వార్తలు