చంద్రబాబుకు యువనేత షాక్‌

14 Nov, 2019 14:13 IST|Sakshi
దేవినేని అవినాష్

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేస్తుండగానే ఆయనకు భారీ షాక్‌ తగిలింది. యువనేత దేవినేని అవినాష్ గురువారం తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా టీడీపీ రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ వైఖరి నచ్చకపోవడంతో వీరు టీడీపీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సరైన ప్రాతినిథ్యం దక్కలేదని కొంతకాలంగా అవినాష్ అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

సీనియర్లతో పాటు యువ నాయకులు టీడీపీని వదిలివెళ్లడం తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత నెలలో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా కొద్దిరోజుల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమ పార్టీలోకి వచ్చేస్తారని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం వ్యాఖ్యానించారు. (చదవండి: చంద్రబాబు ఎంత కష్టపడినా లాభం లేదు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు