మంచు దుప్పట్లో సెగలు!

4 Aug, 2019 04:27 IST|Sakshi
శనివారం స్వస్థలాలకు వెళ్లేందుకు వచ్చిన యాత్రికులతో నిండిపోయిన జమ్మూ రైల్వే స్టేషన్‌

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తారని ప్రచారం

గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు నేతల భేటీ

కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణల్ని చేపట్టడం లేదన్న గవర్నర్‌ మాలిక్‌

శ్రీనగర్‌ నుంచి పర్యాటకుల తరలింపునకు 32 విమానాల ఏర్పాటు

శ్రీనగర్‌/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు.

కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్‌ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా కోరారు.

రంగంలోకి ఐఏఎఫ్‌ విమానాలు..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్‌నాథ్‌ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్‌ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్‌ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు.

భారత వాయుసేన(ఐఏఎఫ్‌)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది.  మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్‌లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది.

అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్‌ మాలిక్‌
జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 35ఏ, ఆర్టికల్‌ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్‌ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్‌నాథ్‌ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది.

ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ విజ్ఞప్తి చేశారు.

‘బుద్ధ అమర్‌నాథ్‌ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ
ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్‌ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్‌నాథ్‌ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్‌ శర్మ మాట్లాడుతూ..‘అమర్‌నాథ్‌ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్‌ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్‌ జిల్లాలో కౌశర్‌నాగ్‌ యాత్ర, కిష్త్వర్‌ జిల్లాలో మచైల్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు.

మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు
అమర్‌నాథ్‌ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు.

ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ
ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు.

భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్‌
పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్‌ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్‌ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్‌ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్‌ సూచించారు. ఒమర్‌ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధినేత సజ్జద్‌ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?
జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్‌ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్‌ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్‌ 370 రద్దవుతుంది.

ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్‌ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్‌ కశ్యప్‌ మాట్లాడుతూ..‘ఆర్టికల్‌ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు.

35ఏ ఎందుకంత ప్రాముఖ్యం?
► జమ్మూకశ్మీర్‌ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్‌ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు.

► కశ్మీర్‌ పగ్గాలు చేపట్టిన షేక్‌ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి.

► షేక్‌ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు.  

►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్‌ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్‌ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్‌ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు.

శ్రీనగర్‌–నిట్‌ క్లాసులు బంద్‌
శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్‌ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్‌ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్‌ షాíß ద్‌ ఖండించారు. ‘శ్రీనగర్‌–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్‌ షాహిద్‌ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్‌ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు.

శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్‌ వద్ద స్థానికుల పడిగాపులు

మరిన్ని వార్తలు