జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా

27 Oct, 2017 14:36 IST|Sakshi

సాక్షి, జగ్గయ్యపేట : తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. పైపెచ్చు  టీడీపీ కౌన్సిలర్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు తెరలేపి చైర్మన్‌ ఎన్నిక హాల్‌లో బారికేడ్లను తొలగించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు.


మెజార్టీ లేకపోవడంతో ఓడిపోతామనే భయంతో ఎన్నిక నిలిపివేయాలని ఆందోళనకు దిగారు.  టీడీపీ నేతలు కౌన్సిల్‌ హాల్‌లోని టేబుళ్లను ఎత్తిపడేశారు. ఎన్నిక జరపాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన మెమోరాండంను చించివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నించినా టీడీపీ నేతలు బరితెగించి విధ్వంసానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక రిటర్నింగ్‌ అధికారి...ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటన చేశారు.

మరోవైపు టీడీపీ కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైక్‌ను తగులబెట్టారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. టీడీపీ నేతల తీరుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రలోభాలతో తమ కౌన్సిలర్లను కొనాలని చూశారని, ఫలించకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మొత్తం 27 కౌన్సిలర్‌ స్థానాలకు వైఎస్‌ఆర్‌ సీపీ 16 కైవసం చేసుకోగా, టీడీపీ 10 స్థానాలకే పరిమితమైంది.

మరిన్ని వార్తలు