తెరవెనుక మంతనాలు సాగిస్తున్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌!

10 Dec, 2018 16:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుండగా ప్రధాన రాజకీయ పార్టీల్లో హైటెన్షన్‌ నెలకొంది. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని ప్రధాన రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అధికారం కోసం తెరవెనుక తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. గతంతో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం పెరగడంతో.. ఆ ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా వెళ్లాయనే దానిపై పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌ రేపటి పరిస్థితులకు అనుగుణంగా పావులు కదపడానికి సిద్దమవుతుంది. మరోవైపు ఇప్పటివరకు మెజారిటీ సర్వేలు టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టునుందని వెల్లడించినప్పటికీ.. అంచనాలు తారుమారై హంగ్‌ ఏర్పడితే ఏం చేయాలనేదానిపై ఆ పార్టీ కసరత్తు చేస్తుంది.

కర్ణాటక మాదిరి వ్యుహంతో కాంగ్రెస్‌..
తాము 70 నుంచి 80 స్థానాల్లో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్న మహాకూటమి నేతలు.. హంగ్‌ ఏర్పడితే చేపట్టాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా నేడు గవర్నర్‌ను నరసింహాన్‌ను కలిసిన కూటమి నేతలు తెలంగాణలో ఒకవేళ హంగ్‌ ఏర్పడితే కూటమిని అతిపెద్ద పార్టీగా పరిగణించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. అంతేకాకుండా విజయం సాధించే అవకాశం ఉన్న స్వతంత్రులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులు విజయం సాధిస్తే వారి మద్దతు తమకే ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ, జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌తో పాటు మరికొంత మంది సీనియర్‌ నేతలను ఆ పార్టీ రంగంలోకి దించుతుంది. అందులో భాగంగా శివకుమార్‌ సోమవారం రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

రంగంలోకి కేటీఆర్‌, హరీశ్‌..
హంగ్‌ ఏర్పడితే పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావులను ఆ పార్టీ రంగంలోకి దించింది. సీఎం కేసీఆర్‌ కూడా మహాకూటమి వ్యుహాలను ఎప్పటికప్పుడూ గమనిస్తున్నారు. కేటీఆర్‌ సన్నిహితులు కొందరు పలు పార్టీలకు చెందిన నేతలతో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెట్లతో కూడా టీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు టచ్‌లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ నేడు ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ముందస్తు అభినందనలు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నట్టు సమాచారం.

క్యాంప్‌ రాజకీయాలకు సిద్దమవుతున్న పార్టీలు
ఒకవేళ హంగ్‌ ఏర్పడితే తమ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ముందస్తు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించడానికి కొన్ని ప్రదేశాలను కూడా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు సమాలోచనలు చేస్తుంది.

మరిన్ని వార్తలు