దీదీ కోటపై మోదీ గురి

7 Apr, 2019 10:18 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ :  ఒకటా, రెండా ఏకంగా 42 లోక్‌సభ స్థానాలు.. దేశంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో మూడో స్థానం.. అందుకే అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే!. పట్టు నిలుపుకోవాలని ఒకరి పోరాటం.. పాగా వేయాలని మరొకరి ఆరాటం.. బెంగాల్‌పై మమత ఆధిక్యం ఇంకా కొనసాగుతోంటే.. నేనున్నానంటూ కమల దళం సవాల్‌ విసురుతోంది. బీజేపీతో చేతులు కలిపినదెవరైనా తనకు శత్రువేనని మమత నినదిస్తుంటే బెంగాల్‌లో అభివృద్ధికి మమతే స్పీడ్‌ బ్రేకర్‌ అంటూ మోదీ కౌంటర్‌ ఇస్తున్నారు. ఇంతకీ ‘బెంగాల్‌ దంగల్‌’లో విజేత ఎవరు?..

పశ్చిమ బెంగాల్‌’ ఈ పేరు చెబితే విశ్వకవి రవీంద్రుడి జాతీయ గీతాలాపనే కాదు. ఆ రాష్ట్రంలో జరిగే రాజకీయ హింస కూడా అందరికీ గుర్తొస్తుంది. కొన్నాళ్ల క్రితం వరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), వామపక్ష–కాంగ్రెస్‌ కూటమి మధ్య జరిగిన రాజకీయ యుద్ధం ఇప్పుడు  టీఎంసీ వర్సస్‌ బీజేపీగా మారిపోయింది. ఈ పోరు రాజకీయం రంగు మార్చుకుంటోంది. 34 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి, సీపీఎం కంచుకోటను బద్దలుగొట్టి పశ్చిమబెంగాల్‌లో చరిత్ర సృష్టించారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఎనిమిదేళ్లుగా రాష్టాన్ని తన కనుసన్నల్లోనే పాలిస్తున్నారు. బెంగాల్‌లో ఆమె మాటే శాసనం. ఆమెను ప్రశ్నించే వారు లేరు. ఎవరి మీదనైనా కన్నెర్ర చేస్తే చాలు ప్రసన్నం చేసుకోవాలనే అనుకుంటారు. మమత హయాంలో అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉన్నా ఆమెను ఎదుర్కొనే ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు రాలేదు. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని మమత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు. 

ఇద్దరూ ఇద్దరే
నరేంద్రమోదీ, మమతా బెనర్జీ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరి ఆలోచనలు ఒకటే. ఇద్దరివీ ఒంటరి జీవితాలే. అంతా తమ చుట్టూ తిరగాలని, తమ మాటే చెల్లుబాటు కావాలని అనుకుంటారు. తమకు ఎవరైనా ఎదురు తిరిగితే అణగదొక్కేస్తారు. ఒకే స్వభావం ఉన్న ఇద్దరూ ఇప్పుడు బెంగాల్‌లో పోటీ పడుతున్నారు. ప్రధానమంత్రి పీఠంపై కన్నేసిన మమత కేంద్రం పేరు చెబితేనే అపర కాళికావతారం ఎత్తుతారు.

శారదా చిట్‌ఫండ్స్, రోజ్‌వ్యాలీ పోంజి పథకాలు ఆమె ప్రభుత్వం మెడకు చుట్టుకున్నా, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేయడానికి వచ్చిన సీబీఐనే ఎదుర్కొన్న ధైర్యం ఆమెది. మోదీనే నువ్వెంత అంటే నువ్వెంత అనగలరు. 

దీదీ ఇలాకాలో మోదీ ధమాకా 
కోల్‌కతాలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఎన్నికల ప్రచారం బీజేపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చింది. మోదీ తన మాటల మాయాజాలంతో దీదీ నినాదాలకు కౌంటర్‌ నినాదాలిస్తూ సభను హోరెత్తించారు. మార్పు రావాలి. మార్పు కావాలి అంటూ తృణమూల్‌పై విరుచుకుపడుతూ బెంగాల్‌ రేసులో దూసుకుపోతున్నా బీజేపీ రన్నరప్‌గానే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన. పశ్చిమ బెంగాల్‌లో మమత దీదీ ఇంకా పట్టు కొనసాగుతోందని ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. అయితే బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాల్ని సాధిస్తుందని తేల్చి చెప్పాయి. 

బీజేపీ ‘తూర్పు పాలసీ’ ఫలిస్తుందా? 
దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న బీజేపీ కేవలం ఉత్తరాదిని నమ్ముకుని ‘మేజిక్‌ ఫిగర్‌ 272’ని చేరుకోలేదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి తూర్పు రాష్ట్రాల్లో ఉన్న 143 ఎంపీ స్థానాలపై కన్నేసింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలపై పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక అమిత్‌ షా కనీసం ఆరుసార్లు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరిచే వ్యూహాల్లో కొంత వరకు విజయం సాధించారు. కనీసం 22 స్థానాలైనా సాధించాలన్న పట్టుదలతో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. 

నాయకత్వం  కొరత
2014 ఎన్నికల్లో బెంగాల్‌లో 18 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఓట్లను మాత్రమే పొందింది. చాలాచోట్ల రెండో స్థానంలో నిలిచింది. అదే ఇప్పుడు బీజేపీకి బలంగా మారింది. అయితే నాయకత్వ సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. బీజేపీలో కీలక నేతలందరూ వలస పక్షులే. జనాల్లో చరిష్మా ఉన్న నేతలే లేరు. అందరూ కాంగ్రెస్, లెఫ్ట్‌ నుంచి వచ్చిన వారే.

దిలీప్‌ ఘోష్‌కి పార్టీ పగ్గాలు అప్పగించాక, ఇతర పార్టీల నుంచి చిన్నా చితక నేతలు వచ్చి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీవీ నటి రూపా గంగూలీకి మహిళా విభాగాన్ని అప్పగించారంటే నాయకత్వం సమస్య ఎంత ఉందో అర్థమవుతుంది. ఎన్నికల వేళ టీఎంసీలో టికెట్లు దక్కని ఎమ్మెల్యే అర్జున్‌సింగ్, మరో ఇద్దరు ఎంపీలు అనుపమ్‌ హజ్రా, సౌమిత్రా ఖాన్‌ బీజేపీ గూటికి చేరడం కొంతవరకు కలిసొచ్చే అంశం.

బీజేపీలోకి వచ్చిన వారంతా మమత, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ నియంతృత్వ పోకడల్ని దుయ్యబట్టడం దీదీలో కాస్త కలవరాన్ని పెంచుతున్నాయి. గత ఎన్నికల స్థాయిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ స్థానాలను దక్కించుకోలేకపోయినా సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటైతే ఆమె కేంద్రంలో చక్రం తిప్పుతారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. 

దీదీ మాట

  •   ‘జనని, జన్మభూమి, జనం (మా, మట్టి, మనుష్‌) గెలిస్తేనే, ప్రజాస్వామ్యం గెలుస్తుంది’  ఇది మమతకు అత్యంత ఇష్టమైన నినాదాల్లో ఒకటి. 
  • ‘2016 అసెంబ్లీ ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో నేనే అభ్యర్థిని’.. ఇది మమత నాటి ప్రచారం.
  • ‘2019లో బీజేపీ ఫినిష్‌ అయిపోతుంది’.  మమత ప్రచారం ‘బెంగాల్‌ గడ్డ మాదే..’

మోదీ తూటా

  •  ‘మమత పాలనలో జనని, జన్మభూమి, జనం సర్వనాశనం అయ్యారు. వారిని కాపాడే సత్తామాకే ఉంది’.. ఇది మమత నినాదానికి మోదీ కౌంటర్‌.
  •  ‘42 స్థానాల్లో పోటీ చేస్తున్నది చౌకీదారులే’.. ప్రస్తుత ఎన్నికల్లో మోదీ స్లోగన్‌. 
  • ‘ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది’..  మోదీప్రచారం ‘మార్పు కావాలి..మార్పు రావాలి’.

యుద్ధానికి సిద్ధం
దీదీ నయా ఫార్ములా
2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా దేశవ్యాప్తంగా మోదీ హవా ప్రస్తుతం లేదనేది అంతటా వినిపిస్తున్న మాట. బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీనికి మమతా బెనర్జీ ఇటీవల జరిగిన విశాఖపట్నం సభలో తనదైన స్టయిల్‌లో ఒక కొత్త ఫార్ములా చెప్పారు.. బీజేపీ దాని మిత్రపక్షాలకు 125 సీట్లకు మించి రావని, మోదీతో చేతులు కలపని పార్టీలే నెగ్గుతాయన్నది ఆమె థియరీ. ఇదేదో అల్లాటప్పాగా ఆమె చెప్పలేదు.

2014 ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, అంకెలు లెక్కలు అన్నీ వేసుకొని ఒక అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వీచినప్పుడే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 191 స్థానాల్లో బీజేపీ 21 సీట్లు సాధించింది. వాటిలో కర్ణాటకలోనే 17 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 71 స్థానాలు సాధించిన యూపీలో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనడంతో 15 నుంచి 20కి మధ్య బీజేపీ ఆగిపోతుందని ఆమె అంచనా.

ఇక  క్లీన్‌స్వీప్‌ చేసిన రాజస్తాన్, గుజరాత్, కాకుండా కొన్ని హిందీ రాష్ట్రాల్లో కూడా ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు బీజేపీకి ఎక్కడ నుంచి వస్తాయనేది మమత వాదన. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైతే కనీసం 30 సీట్లు సాధించినా తాను చక్రం తిప్పేయొచ్చన్నది మమత ఆశ.

ఎన్నికల్లో ఇవే ప్రచారాస్త్రాలు
పౌర జాతీయ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ): అసోంలో అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి కేంద్రం తెచ్చిన పౌర జాతీయ రిజిస్టర్‌ ప్రకంపనలు బెంగాల్‌ను కూడా తాకాయి. బీజేపీ – టీఎంసీ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. మన దేశానికి వచ్చిన శరణార్థుల్ని గెంటేస్తారా అంటూ మమతా కేంద్రంపై కన్నెర్ర చేశారు. దీంతో బంగ్లాదేశ్‌ నుంచి బెంగాల్‌కు వచ్చిన వలసదారుల్లో ఒక రకమైన గందరగోళం, అభద్రతా భావం నెలకొంది. ఇది ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించనుంది. 

అక్రమ వలసలు
సరిహద్దు దేశాల నుంచి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తూ మమత బెంగాల్‌ గడ్డను వారికి స్వర్గధామంగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనినే బీజేపీ ఎన్నికల అంశంగా పదేపదే లేవనెత్తుతోంది. మమతను ఇరుకున పెడుతోంది. 

పౌరసత్వ సవరణ బిల్లు
ఈ బిల్లు కూడా ఎన్నికల్లో ప్రధానాంశమే. ఈ బిల్లు ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘ్ఘనిస్తాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని ఇచ్చే బిల్లు. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది కానీ ఇంకా రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఇది వివక్షతో కూడుకున్నదని దీదీ మండిపడుతున్నారు. 

నిరుద్యోగం
నిరుద్యోగం అనేది ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికల అంశంగా మారింది. మమత  తాము రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని అంటున్నారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో చిన్నా చితక పరిశ్రమలు కుదేలైపోయాయంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రచారం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు