కేకేపై టీజీ తీవ్ర విమర్శలు

23 Jun, 2018 03:00 IST|Sakshi

నానా దుర్భాషలాడిన ఏపీ ఎంపీ

మాది వేడి రక్తం, మీది సారాయి రక్తం

తెలంగాణ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావుపై ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ తీవ్రమైన పదజాలంతో దూషణలకు దిగారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలువురు తెలంగాణ రాజకీయ నాయకులపై కూడా రాయడానికి వీల్లేని అసభ్యకరమైన పదజాలం వాడారు. ‘‘కేకే మాట్లాడితే అందరూ తల గోక్కుంటారు. నాలుగైదు భాషలు కలిపి పిచ్చోళ్ల భాష మాట్లాడుతుంటాడు. ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆయనను ఎవరూ కేకే అనేవారు కాదు. పిచ్చోడు వచ్చాడా అనేవారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా పిచ్చోడు అనేవారే తప్ప కేకే అని పిలిచేవాళ్లు కాదు’’అంటూ ఎద్దేవా చేశారు.

‘‘రాత్రయితే ఫుల్‌గా తాగి కేసీఆర్‌ కాళ్లొత్తడం తప్ప నీకేం పనుంది? తాగుబోతు సన్నాసివి. ఏం పని చేస్తావ్‌? నీకు మెదడుందా? మోకాళ్లలో ఉంది. పిచ్చోడికి అంతా పిచ్చోడి మాదిరిగానే కనిపిస్తుంది. చంద్రబాబు, ఆయన కొడుకు కష్టపడుతున్నారు. నువ్వేం కష్టపడుతున్నావ్‌రా నాయనా? హరీశ్, కేటీఆర్, కవితలను చూసి నేర్చుకో. లేదంటే లోకేశ్‌ వద్దకు రా’’అంటూ కేకేపై తిట్ల వర్షం కురిపించారు. ‘‘నేను సమస్యల మీద మాట్లాడితే బదులివ్వకుండా నాకే మతిభ్రమించిందన్నాడు. కేకేకే పిచ్చి ముదిరింది. ఆయనను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రతిపాదిస్తే ఈ పిచ్చోడితో వేగలేమని ప్రతిపక్షాలు ఒప్పుకోవు.

తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోయారే తప్ప నాయకులకు ఏమీ కాలేదు. వారిని ముందు పెట్టి ఉద్యమం నడిపారు. పిల్లలు చనిపోతున్నారనే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్‌ ఉద్యమం నడిపారు తప్ప కేకే ఎక్కడున్నాడు? మీ తెలంగాణ గడ్డ మీద ఉండి పోరాటం చేశాం. మీకు దమ్ముంటే మా వద్దకు రా. బట్టలిప్పి పరిగెత్తిస్తారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి సమస్యల పరిష్కారానికి మనం కలిసి పోరాడకుంటే హైదరాబాద్‌లోని ఆంధ్ర, రాయలసీమ వాళ్లు మీకెలా ఓటేస్తారని హెచ్చరికగా చెప్పాం.

నావి చిల్లర మాటలైతే మీరెందుకు సీరియస్‌గా తీసుకున్నారు? సబ్జెక్టుపై మాట్లాడితే మాపై నిందలేస్తారా? మా శరీరంలో వేడి రక్తం ఉంది. మీ శరీరంలో ఏముంది? సారాయి రక్తం’’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదడు మోకాళ్లలో ఉన్నవాళ్లను పెట్టుకుని పరిపాలన చేయొద్దని కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీని ఏపీ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి వెళ్తున్నాయనే సందేశం వెళ్తే ప్రజలకు న్యాయం చేయలేరు’’అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు టీజీ డబ్బులిచ్చి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని ఓ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. 

మరిన్ని వార్తలు