రేవంత్‌ టీఆర్‌ఎస్‌లోకి వస్తానన్నాడు: తలసాని

1 Dec, 2017 04:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు తనతో సంప్రదింపులు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చోటు దక్కకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. సహచర మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డితో కలసి గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. తలసాని మాట్లాడుతూ ‘‘నేను టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన తర్వాత రేవంత్‌ కూడా వస్తానని నాతో మాట్లాడిండు.

పార్టీలో చేర్చుకోమని కోరితే ఈ విషయాన్ని సహచర పాలమూరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లా.. వాడు పెద్ద దొంగ, అలాంటోళ్లను తీసుకోవద్దు అని వారు అన్నరు. అందుకే రేవంత్‌కు టీఆర్‌ఎస్‌లో చోటు దక్కలేదు’’ అని మంత్రి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లినప్పుడు కొడంగల్‌ పౌరుషం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. గొల్ల, కురుమల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్‌.. శంషాబాద్‌లో 10 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ భూమిలో రూ.5 కోట్లతో గొల్లలకు, మరో రూ.5 కోట్లతో కురుమల సంక్షేమ భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ స్థలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్‌ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు