‘చారాణ చేశా.. బారాణ చేయాల్సి ఉంది’

19 Dec, 2018 16:24 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల నియోజకవర్గానికి ఇప్పటి వరకు చారాణ వంతు మాత్రమే చేశా..ఇంకా బారాణ చేయాల్సి ఉందని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నిమమితులైన తర్వాత తొలిసారి సిరిసిల్లకు వచ్చిన కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..అతిపెద్ద మెజార్టీతో గెలిపించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తనకు గుర్తింపు వచ్చిందంటే దానికి సిరిసిల్ల ప్రజలే కారణమన్నారు. రాబోయే 6 మాసాల్లో సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వెల్లడించారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణాలో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా తెలియాలంటే దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ లేకుండా తృతీయ ప్రత్యామ్నాయం కావాలి.. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడు ఏళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు. నేతన్నల బతుకులు ఇంకా మారాలి..వారి కళ్లలో ఆనందం చూడాలని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడతానని హామీ ఇచ్చారు. ఆనాడు బతుకమ్మ చీరల పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. సిరిసిల్ల నేతన్నల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, సిరిసిల్లను సిరిశాలగా మారుస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు