ఢీ.. రాజయ్య వర్సెస్‌ ప్రతాప్‌

22 Sep, 2018 10:38 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ రాజయ్యకు, అదే పార్టీకి చెందిన అసమ్మతి నేత రాజారపు ప్రతాప్‌ ఏ పార్టీలో ఉన్నా ప్రత్యర్థులుగానే ఉంటున్నారు. వీరిద్దరు కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులు టికెట్‌ కోసం కుస్తీ పట్టేవారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ రాజయ్య దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మూడేళ్లకు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి రాజయ్య, కాంగ్రెస్‌ నుంచి ప్రతాప్, టీడీపీ నుంచి కడియం  పోటీ చేయగా రాజయ్య గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల్లో ప్రతాప్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉంటూనే రాజయ్యతో పోటీపడుతున్నారు.  

సాక్షి, జనగామ: వారిద్దరు నాడు.. నేడు కొనసాగింది ఒక జెండా కిందనే. నాడు కాంగ్రెస్‌లో ఉంటే.. నేడు కొనసాగుతుంది టీఆర్‌ఎస్‌లో. ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడూ భిన్నధృవాలుగానే విడిపోతున్నారు. ప్రత్యర్థులుగానే కలబడుతున్నారు. సవాల్‌కు ప్రతిసవాల్‌ విసురుకుంటున్నారు. వారే స్టేషన్‌ ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు తాటికొండ రాజయ్య, రాజారపు ప్రతాప్‌. వీరి రాజకీయ కేంద్రమైన స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో రోజురోజుకు వర్గపోరు ముదురుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నాయకులు పార్టీలో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వర్గీయులు ఒక వర్గంగా విడిపోగా మరో అసమ్మతి నేత రా జారపు ప్రతాప్‌ వర్గీయులు మరో వర్గంగా విడిపోయారు. అయితే కడియం వర్గీయులు అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తుండగా ప్రతాప్‌ మాత్రం తానే బరిలోకి దిగుతానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఘన్‌పూర్‌లోని వర్గపోరు టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

బహిరంగ విమర్శలతో రాజకీయ వేడి..
ఒకే పార్టీలో కొనసాగుతున్న రాజయ్య, ప్రతాప్‌ బహిరంగ విమర్శలకు దిగుతుండడంతో నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నెల 6న కేసీఆర్‌ శాసన సభను రద్దు చేసి అదే రోజు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌గా ఉన్న తాటికొండ రాజయ్యకు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడిన ప్రతాప్‌ తాను రెబెల్‌గా పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇటు పార్టీ అభ్యర్థి రాజయ్య ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రజలతో మమేకం అవుతుండగా అటు ప్రతాప్‌ సైతం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నెల 14న జనగామ జిల్లా కేంద్రం నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో రఘునాథపల్లి వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని పోలీసులు ర్యాలీని నిలిపివేశారు. దీంతో ప్రతాప్‌ పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు.

అలాగే రాజయ్యకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని ప్రతాప్‌ అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా తన అనుచరుడి కోసం ప్రతాప్‌ ధర్నాకు దిగారు. అంతేగాక బహిరంగంగా రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తాను కేసీఆర్‌ బొమ్మతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని శుక్రవారం జఫర్‌గఢ్‌లో జరిగిన ప్రచారంలో ప్రతా ప్‌ ప్రకటించారు. ఇద్దరి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. నియోజకవర్గంలో నెలకొన్న గ్రూ పు తగాదాలతో పార్టీ క్యాడర్‌ అయోమయానికి గురవుతున్నారు.

మరిన్ని వార్తలు