ఇవేమి ఏర్పాట్లు? 

12 Apr, 2019 02:23 IST|Sakshi
నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లోని 146 పోలింగ్‌ కేంద్రంలో వీవీ ప్యాట్‌లను పరిశీలించి, పోలింగ్‌ శాతాన్ని నమోదు చేసుకుంటున్న కవిత

పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు: కవిత  

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా 

నవీపేట (బోధన్‌): పోలింగ్‌ కేంద్రాలలో కనిపించిన లోపాలను ఎన్నికల కమిషన్‌ సవరించాలని నిజామాబాద్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత పేర్కొన్నారు. నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలసి ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాలలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక లోపాలతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పారు.

ఈవీఎం ప్యాట్‌లపై నంబర్లు లేకపోవడం, పోలింగ్‌ సిబ్బందికి ఈ విషయమై ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, పోలింగ్‌ కేంద్రాలలో రాకపోకలకు ఒకే ద్వారం ఉండటం తదితర సమస్యలు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిజామాబాద్‌ ఎన్నికలలో 12 ఈవీఎంలను వాడటంతో ఈ ఎన్నిక ప్రత్యేకమైనదన్నారు. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ కొనసాగించాలని ఈసీకి విన్నవించినా ఆరింటి వరకే అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలలో పోలింగ్‌ శాతం తగ్గిందని, పట్టణ ఓటర్లు బయటకు వచ్చి, ఓటేయాలని కోరారు.  

45 నిమిషాలు క్యూలోనే.. 
కవిత అత్తగారి ఊరైన పోతంగల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటేయడానికి వచ్చి 45 నిమిషాలు క్యూలోనే నిల్చున్నారు. మొదటి ఓటు వేయాలని ఉదయం 7.30 గంటలకు కుటుంబసభ్యులతో కలసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అవి పనిచేయకపోవడంతో పోలింగ్‌ కేంద్రం బయటే నిరీక్షించారు. 8.45 గంటలకు లోపాన్ని సవరించాక మొదటి ఓటును కవిత వేశారు. తరువాత భర్త అనిల్‌కుమార్, మామయ్య రాంకిషన్‌రావ్, అత్తయ్య, మరిది ఓటేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు