ఢిల్లీ వైపు ఉత్తమ్‌ చూపు

12 Feb, 2020 04:19 IST|Sakshi

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పరిశీలనలో పేరు

టీపీసీసీ అధ్యక్షునిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

రేసులో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లు కూడా..

ఏఐసీసీ మరో ప్రధాన కార్యదర్శిగా గీతారెడ్డి పేరు..

ఈ నెలాఖరు లేదంటే మార్చి తొలి వారంలో ఖరారు!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)లో త్వరలో మార్పులు జరగబోతున్నాయి. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంకల్లా టీపీసీసీ అధ్యక్షుని మార్పుతో పాటు ఏఐసీసీ స్థాయిలో పలువురికి పదవులు లభించనున్నట్టు గాంధీభవన్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటారనీ, ఆయన స్థానంలో భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమిస్తారని తెలుస్తోంది.

టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనని, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని, దీనిపై త్వరలోనే కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఉత్తమ్‌ సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆయనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చి ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌తో పాటు ఒకరిద్దరు తెలంగాణ నేతలకు ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.

కోమటిరెడ్డి.. ఖరారే! 
టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైనట్టేనని గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో ఆయన ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌లో.. తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొని మూడు మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగురవేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే. ఆయన గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. ప్రస్తుతం కాంగ్రెస్‌తోనే సర్దుకుపోయి పనిచేస్తున్నారు.

ఇటీవలి మున్సిపల్‌ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ ఇద్దరు సోదరులు.. టీపీసీసీ పగ్గాలు ఇస్తే దీటుగా పనిచేస్తామని, పార్టీని అధికారంలోకి తెస్తామని చాలాకాలంగా పార్టీ అధిష్టానానికి చెబుతూ వస్తున్నారు. మరోవైపు వెంకటరెడ్డి లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచీ కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తూ తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు నిధుల కోసం చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటూ సోనియాగాంధీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు అవకాశమివ్వాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం టీపీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈ పదవుల్ని ఒకటి లేదా రెండుకు పరిమితం చేసి.. ఒక బీసీ, మరో ఎస్సీ నేతకు ఈ హోదా కల్పించవచ్చని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.

రాహుల్‌ టీమ్‌లో రేవంత్‌! 
వాస్తవానికి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించే అంశాన్ని ఏఐసీసీ సీరియస్‌గానే పరిశీలించింది. రేవంత్‌ కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో తనకు అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరారు కూడా. అయితే, రేవంత్‌రెడ్డి రాష్ట్ర పార్టీలో కీలక నాయకుడని, ఎన్నికలకు ముందు రేవంత్‌ అస్త్రాన్ని ప్రయోగించాలనే భావనతో ప్రస్తుతానికి ఆయనను రాహుల్‌ టీంలో నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ యాత్రను సమన్వయం చేసే బాధ్యతను రేవంత్‌కు అప్పగిస్తారని, ఆయనతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్‌.సంపత్‌కుమార్, చల్లా వంశీచందర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌కు రాహుల్‌ టీంలో చోటు కల్పిస్తారనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది.

గీతారెడ్డికి కీలక పదవి
మహిళా కోటాలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు గీతారెడ్డికి ఏఐసీసీలో కీలక పదవి లభిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్‌గా ఉన్న ఆమెను కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్టు సమాచారం. ఏఐసీసీ పదవుల రేసులో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, సీఎల్పీ మాజీ నాయకుడు కె.జానారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహకు కూడా ఏఐసీసీ అనుబంధ విభాగాల్లో చోటు లభిస్తుందని సమాచారం.  

మరిన్ని వార్తలు