'ఇతరుల’ కథ

2 Nov, 2018 03:30 IST|Sakshi

థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ‘ఇతరులు’గా పరిగణన

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వీరి సంఖ్య అధికం

ఉమ్మడి ఏపీలో 2014లో తొలిసారి ఓటు హక్కు వినియోగం

ఓటర్ల జాబితాను ఎప్పుడైనా చూశారా? అందులో స్త్రీ, పురుష ఓటర్లతో పాటు మరో కాలమ్‌ ఉంటుంది. అదేమిటో గమనించారా? అదే ఇతర ఓటర్లు. అటు మహిళ, ఇటు పురుషులుగా గాకుండా థర్డ్‌జెండర్‌గా నమోదు చేసుకున్న వారిని ‘ఇతరులు’గా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది.

రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ట్రాన్స్‌జెండర్లకు ఇవ్వాలని, మానవ హక్కులను కాపాడాలని పలు సంస్థలు అభ్యర్థించడంతో  2012లో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని ఓటర్లుగా గుర్తించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ విప్లవాత్మక మార్పునకు అప్పటి సీఈసీ చీఫ్‌ కమిషనర్‌ నవీన్‌ బీ చావ్లా శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా థర్డ్‌జెండర్స్‌ 2014 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గ్రేటర్‌లో అధికం
మన రాష్ట్రంలో ఈ కేటగిరీ ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,663 ఓటర్లలో దాదాపు సగం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్‌ (పట్టణ) జిల్లాలో నమోదయ్యారు. సిరిసిల్ల జిల్లాలో అత్పల్పంగా ముగ్గురు మాత్రమే ‘ఇతరులు’ ఉన్నారు. గతంతో పోలిస్తే ఇలా నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 401, మేడ్చల్‌ 338, హైదరాబాద్‌ 317, వరంగల్‌ (పట్టణ) 172 మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పేర్కొంది.

వాస్తవానికి ఈ ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఫారం–6లో ఇతరులుగా పేర్కొన్నవారినే ఈ కేటగిరీ కింద ఎన్నికల సంఘం నమోదు చేస్తోంది. ఇందులో లింగమార్పిడి చేసుకున్నవారే కాకుండా నడవడికలోనూ తేడాగా ఉన్నవారినీ ఈ కేటగిరీ కింద ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే, ఇదీ పూర్తిగా వారి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.  

- డి.వెంకటేశ్వరరెడ్డి, సాక్షి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

మరిన్ని వార్తలు