మూడో విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం

21 Apr, 2019 18:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్‌ జరగనుంది. గుజరాత్‌, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, యూపీ, చత్తీస్‌గఢ్‌, ఒడిసా, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, గోవా, జమ్మూ కశ్మీర్‌,  త్రిపుర సహా దాద్రా నగర్‌ హవేలి, డామన్‌ డయ్యూలో మూడో విడత పోలింగ్‌ జరగనుంది. ధర్డ్‌ ఫేజ్‌లో పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కాషాయ పార్టీ తరపున ర్యాలీలు, ప్రచార సభల్లో పాల్గొనగా, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రియాంక గాంధీలు ఆ పార్టీ తరపున ప్రచారం చేపట్టారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం యూపీ సహా పలు రాష్ట్రాల్లో తమ అభ్యర్ధుల తరపున ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల పరిశీలన ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం తుదిగడువు కాగా, ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు