మూడో దశ తిరిగేనా

22 Apr, 2019 08:41 IST|Sakshi

కమలానికి టానిక్‌.. ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం

మొదటి, రెండు దశల్లో కోల్పోయిన స్థానాలు ఈ దశలో భర్తీ?

రేపు 115 లోక్‌సభ స్థానాలకు మూడో దశ పోలింగ్‌

మోస్తరు పోలింగ్‌.. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు.. స్వల్ప ఘర్షణలు. సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల తీరుతెన్నులివి. 2014తో పోలిస్తే ఈసారి ఎన్నికల కోలాహలం తక్కువగా ఉన్నా.. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా దేశం ఇంకో దశ పోలింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 115 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. దేశ భావి ప్రధాని ఎవరు? గెలుపు ఏ పార్టీని వరిస్తుందన్న చిక్కు ప్రశ్నలకు తొలి రెండు దశలు సమాధానమివ్వకున్నా మూడో దశ తరువాత వీటిపై స్పష్టత రానుంది. మొత్తమ్మీద 115 స్థానాలకు జరిగే మూడో దశ పోలింగ్‌లో బీజేపీ కొన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. గత రెండు దశల్లోని లోక్‌సభ సీట్లలో కోల్పోయే కొన్నిటిని మూడో దశలో భర్తీ చేసుకోవచ్చని అంచనా. రాష్ట్రాల వారీగా రాజకీయాల తాజా పరిస్థితి..

కేరళ : ఎవరిదో గెలుపు కళ
కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌తో కూడిన యు నైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌.. రెండు చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూడీఎఫ్‌ 12, ఎల్డీ ఎఫ్‌ 8 స్థానాలు గెల్చుకున్నా యి. ఈ ఎన్నికల్లో సీపీఎం 16 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ నాలుగింటికి పరిమితమైంది. యూడీఎఫ్‌లోనూ కాంగ్రెస్‌ 16, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ రెండు, కేరళ కాంగ్రెస్‌ (ఎం), రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ ఒక్కో స్థానంలోనూ బరిలో ఉన్నాయి. బీజేపీ 14, భారత్‌ ధర్మ జనసేన 5 స్థానాల్లోనూ, కేరళ కాంగ్రెస్‌ ఒక్క స్థానంలోనూ పోటీ చేస్తున్నాయి. సీపీఎం, కాంగ్రెస్‌ 12 స్థానాల్లో ప్రత్యక్ష పోరులో ఉండగా ఇతర స్థానాల్లో భాగస్వామ్య పార్టీల మధ్య పోటీ ఉంది. 

ప్రభావం చూపే అంశాలు

  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు ఈసారి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ప్రయత్నించడం ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరిగేందుకు కారణమైంది. ఈ వివాదం నేపథ్యంలో హిందూ ఓటర్లు తమ వైపు మళ్లుతారన్న ధీమా బీజేపీలో వ్యక్తమవుతోంది.
  • ఈ ఏడాది కేరళను ముంచెత్తిన వరదలు, సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలం, రాజకీయ హత్యలు ఓటర్లను ప్రభావితం చేసేవే.

ఎవరెక్కడ పోటీ?
 కన్నూర్‌ సిట్టింగ్‌ ఎంపీ పీకే శ్రీమతి (సీపీఎం) మరోసారి కాంగ్రెస్‌కు చెందిన కె.సుధాకరన్‌తో పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో సుధాకరన్‌ తక్కువ మార్జిన్‌తో ఓడిపోయారు. 
 వడక్కరలో విద్యార్థి నాయకుడు అబ్దుల్‌ షుకూర్, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కె.మనోజ్‌ల హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.జయరాజన్‌ సీపీఎం తరఫున పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌కు చెందిన కె.మురళీధరన్‌ నుంచి ఈయనకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఏడేళ్ల క్రితం జరిగిన ఓ వామపక్ష నేత హత్య కూడా ఈసారి ఎల్డీఎఫ్‌ ఎన్నికకు అడ్డంకిగా నిలుస్తోంది.
 పథనంతిట్ట నుంచి పోటీకి బీజేపీ శబరిమల ఉద్యమాన్ని నడిపిన కె.సురేంద్రన్‌ను ఎంపిక చేయగా సిట్టింగ్‌ ఎంపీ అంటో ఆంటోనీ (కాం గ్రెస్‌), వీణా జార్జ్‌ (సీపీఎం) బరిలో ఉన్నారు. 
 త్రిశూర్‌ నియోజకవర్గంలో భారత్‌ ధర్మ జనసేన, కాంగ్రెస్, సీపీఐ పోటీ చేస్తున్నాయి ఇక్కడ. బీజేపీ, హిందూ ఎళవ తెగల మద్దతున్న భారత్‌ ధర్మ జనసేన విజయంపై ఆశలు పెట్టుకుంది. 
 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో సీపీఎం కోజీకోడ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఏ.ప్రదీప్‌ కుమార్‌ను కాంగ్రెస్‌కు చెందిన ఎంకే రాఘవన్‌పై పోటీకి నిలిపింది.
 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తిరువనంతపురంలో ఎలాగైనా గెలుపొందాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సీపీఐకి చెందిన సి.దివాకరన్,  మిజోరామ్‌ మాజీ గవర్నర్‌ రాజశేఖరన్‌ కుమ్మణ్ణం (బీజేపీ) బరిలో ఉన్నారు. 
 కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. 

కర్ణాటక: పోటీ కటకట
కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. గడిచిన 18న సగం సీట్లకు పోలింగ్‌ జరిగింది. మిగిలిన 14 స్థానాలైన చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట్, బిజాపూర్‌ (ఎస్సీ), హావేరీ, ధార్వాడ్‌తో పాటు ముంబై కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గ (ఎస్సీ), బీదర్, రాయచూర్, బళ్లారి (ఎస్టీ), కొప్పళ, శివమొగ్గ, దావణగెరె, ఉత్తర కన్నడ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇందులోని 11 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్‌ మూడింటిని గెలుచుకోగలిగింది. కాంగ్రెస్‌ –జేడీఎస్‌ కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ తాను గతంలో సాధించిన 17 స్థానాలను అందుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఈసారి మోదీ హవా, యడ్యూరప్ప సమర్థ ఎన్నికల నిర్వహణతో గట్టెక్కుతా మని బీజేపీ ధీమాగా ఉంది. 

ఈ స్థానాల్లో నేనంటే నేను..
  మరాఠీ మాట్లాడే ప్రజలు 60 శాతమున్న బెళగావిలో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సురేశ్‌.. విరూపాక్షి ఎస్‌.సాధునవర్‌ (కాంగ్రెస్‌) తలపడుతున్నారు. 
 కేంద్ర మంత్రి రమేశ్‌ జిగజిణిగి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజాపూర్‌లో సునీతా దేవానంద్‌ చవాన్‌ (కాంగ్రెస్‌) గట్టి పోటీనిస్తున్నారు. 
  గుల్బర్గలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఉమేశ్‌జాదవ్‌తో పోటీ పడుతున్నారు. 
  బళ్లారిలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ వి.ఎస్‌.ఉగ్రప్ప, బీజేపీకి చెందిన దేవేంద్రప్ప మధ్య పోటీ జోరుగా సాగుతోంది. 
  బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తర కన్నడ, కోస్తా తీర ప్రాంతాల్లో కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే.. ఆనంద్‌ అస్నోటికర్‌ (జేడీఎస్‌)తో పోటీ పడుతుండగా శివమొగ్గలో మాజీ సీఎం బి.ఎస్‌.యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర మరో మాజీ సీఎం ఎస్‌.బంగారప్ప కుమారుడు మధు బంగారప్పను ఎదుర్కొంటున్నారు.

మహారాష్ట్ర: బీజేపీ–శివసేన హవా!
మహారాష్ట్రలోని పుణె, బారామతి, అహ్మద్‌నగర్, మాధా, సాంగ్లీ, సతారా, కోల్హాపూర్, హట్కన్‌మంగ్లే , జల్‌గావ్, రావేర్, జల్నా, ఔరంగాబాద్, రాయ్‌గడ్, రత్నగిరి–సింధుదుర్గ్‌ లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లోని నాలుగింటిని శివసేన గెలుచుకోగా, బీజేపీ – శివసేన కూటమి తొమ్మిది, స్వాభిమాన్‌ పక్ష ఒక సీటులో గెలుపొందాయి. ఏతావాతా ఈ దఫా ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో బీజేపీ –శివసేన కూటమి హవా కొనసాగనుందని చెప్పాలి.
అహ్మద్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో ఈసారి ఆసక్తికరమైన పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంగ్రామ్‌ జగతాప్‌ ఎన్సీపీ తరఫున, సంజయ్‌ విఖే పాటిల్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత కూడా అయిన రాధాకృష్ణ విఖే పాటిల్‌ కుమారుడు సంజయ్‌ కాగా, ఎన్సీపీ ఎమ్మెల్సీ అరుణ్‌ జగతాప్‌ కుమారుడు సంగ్రామ్‌ కావడం గమనార్హం. 
 ఔరంగాబాద్‌లో శివసేన ప్రాబల్యం ఎక్కువ. 1999 నుంచి చంద్రకాంత్‌ ఖైరే ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి ఆయన ఏఐఎంఎఎంకు చెందిన ఇంతియాజ్‌ జలీల్‌తో పాటు సుభాష్‌ జంబాద్‌ (కాంగ్రెస్‌), అబ్దుల్‌ సత్తార్‌ నబి (సిలోడ్‌ ఎంపీ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు)ను ఎదుర్కొంటున్నారు. 
 రాయగఢ్‌లో శివసేన సిట్టింగ్‌ ఎంపీ అనంత్‌ గీతే ఎన్సీపీకి చెందిన సునీల్‌ తత్‌కరేతో పోటీ పడుతుండగా.. ఎన్సీపీ కంచుకోట అయిన బారామతిలో శరద్‌ పవార్‌ కుమార్తె, సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే బీజేపీ అభ్యర్థి కంచన్‌ కుల్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ ఓటమికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. 
హట్కన్‌మంగ్లేలో స్వాభిమాన్‌ పక్షకు చెందిన రాజు శెట్టి శివసేన అభ్యర్థి ధారియాశబుల్‌ మానెతో పోటీ పడుతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌: కులం, మతం, ప్రాంతం..
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో మూడో దఫా పోలింగ్‌లో భాగంగా నటి జయప్రద పోటీ చేస్తున్న రాంపూర్‌తో పాటు సంభల్, బదాయూ, అనోలా, బరేలీ, ఫిలీభీత్, ఫిరోజాబాద్, మొరాదాబాద్, మెయిన్‌పురి, ఈటా  స్థానాలు పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ పది స్థానాల్లో ఏడింటిని గెలుచుకోగా సమాజ్‌వాదీ పార్టీ మూడు  సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ ఉండగా.. ఇంకోవైపు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి సవాల్‌ విసురుతోంది. మతం పేరుతో ప్రచారం చేసినందుకు ఎన్నికల కమిషన్‌ శిక్ష అనుభవించిన బీఎస్పీ అధినేత్రి మయావతి, బీజేపీ సీనియర్‌ నేత, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇద్దరూ మళ్లీ ప్రచార రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినం దుకు ఎస్పీ నేతపై కూడా ప్రచార నిషేధం వేటు పడ్డ సంగతి తెలిసిందే. కులం, మతం, ప్రాంతం అంశాల ఆధారంగా యూపీ ఓటర్లను విడదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో విజేత ఎవరనేది తేల్చడం కష్టమే. ఈసారి బీజేపీ కొన్ని స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంటింటి ప్రచారంతో బీజేపీ అవకాశాలను మెరుగుపరిచే పనిలో ఉంది.

పోటీ.. హోరాహోరీ
సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ మధ్య రాంపూర్‌ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్శిస్తోంది. ఆజంఖాన్‌ చేసిన మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు ఓటర్లను చీల్చి బీజేపీకి లాభం చేకూర్చవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ కపూర్‌ ప్రత్యర్థి పార్టీల ఓటుబ్యాంకులను చెల్లాచెదురు చేయగల సామర్థ్యమున్న వాడే కావడం గమనార్హం.
బదౌన్‌ సీటు విషయానికొస్తే ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ ధర్మేంద్రయాదవ్‌ (ఎస్సీ), కాంగ్రెస్‌కు చెందిన సలీమ్‌ ఇక్బాల్‌ షేర్వానీ, సంఘమిత్ర మౌర్య (బీజేపీ) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 
కేంద్ర మంత్రి మేనకాగాంధీకి పట్టున్న పిలీభీత్‌ నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. ఎస్పీకి చెందిన హేమరాజ్‌ వర్మ ఈ స్థానంలో వరుణ్‌గాంధీ ప్రత్యర్థి. 
మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఇక్కడ 1996 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. ఈసారి ములాయం ప్రేమ్‌సింగ్‌ శాఖ్యా (బీజేపీ)తో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ అభ్యర్థిని పోటీకి దించలేదు.

ఒడిశా: బీజేడీ–బీజేపీ ఢీ
ఒడిశాలో ఆరు స్థానాలకు మూడోదశ పోలింగ్‌ జరగనుంది. పశ్చిమ ప్రాంతంలోని సంబల్‌పూర్, కియోంఝర్‌ (ఎస్టీ)తో పాటు తీర ప్రాంతంలోని ధీన్‌కనాల్, కటక్, పురి, భువనేశ్వర్‌ను గత ఎన్నికల్లో బీజేడీ గెలుచుకుంది. ఈసారి కాషాయ పార్టీ నుంచి బీజేడీ గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. పూరి, కటక్‌ నియోజకవర్గాల్లో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. పూరిలో బీజేడీ సీనియర్‌ నేత పినాకీ మిశ్రా.. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రాతో పోటీ పడుతుండగా కటక్‌లో మాజీ డీజీపీ ప్రకాశ్‌ మిశ్రా (బీజేపీ) రూపంలో సిట్టింగ్‌ ఎంపీ భర్తుహరి మహతబ్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది.

బిహార్‌: మాదంటే ‘మాధే’పూర్‌
బిహర్‌లోని జంజీహార్‌పూర్, సౌపాల, మాధేపుర, ఖగారియా, అరారియా స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీ చెరో రెండు స్థానాలు గెలుచుకోగా మిగిలిన ఒక్క స్థానాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది.  శరద్‌యాదవ్‌ (లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌), సిట్టింగ్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ (జన్‌ అధికార్‌ పార్టీ), దినేశ్‌చంద్ర యాదవ్‌ (జేడీయూ) మధ్యS పోటీతో మాధేపూర్‌ వేడెక్కుతోంది. ఆరారియాలోనూ సర్ఫరాజ్‌ ఆలమ్‌ (ఆర్జేడీ), ప్రదీప్‌ కుమార్‌ సింగ్‌ (బీజేపీ) మధ్య పోరు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. 

పశ్చిమబెంగాల్‌:  దంగల్‌
మమతా బెనర్జీ అడ్డా పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో పోలిం గ్‌ జరిగే బేలూర్‌ఘాట్, మల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్‌ స్థానాల్లో 40 శాతం వరకు ముస్లింలు ఉన్నట్లు అంచనా. గత ఎన్నికల్లో ఈ ఐదింటిలో కాంగ్రెస్‌ మూడు గెలుచుకోగా, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం ఒక్కో స్థానానికి పరిమితమయ్యాయి. 
ముర్షిదాబాద్‌లో బదారుద్దౌజ ఖాన్‌ (సీపీఎం), అబూ తాహెర్‌ ఖాన్‌ (టీఎంసీ), అబూ హీనా (కాంగ్రెస్‌) మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 
జంగీపూర్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, సిట్టింగ్‌ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ– జుల్ఫికర్‌ అలీ (సీపీఎం) పోటీ పడుతున్నారు. 
మాల్దా ఉత్తర్‌ సిట్టింగ్‌ ఎంపీ మౌసమ్‌ నూర్‌ (టీఎంసీ)– బీజేపీ అభ్యర్థి ఖగెన్‌ ముర్ము నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సీపీఎం నుంచి విశ్వజీత్‌ ఘోష్‌ ఇక్కడ పోటీలో ఉన్నారు. 
దక్షిణ మాల్దాలో అబూ హసీమ్‌ ఖాన్‌ చౌదరీ (కాంగ్రెస్‌)– మొఅజ్జీన్‌ హుస్సేన్‌ (తృణమూల్‌), శ్రీరూప (బీజేపీ) తలపడుతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌: ఎవరి ఆశలు వారివి..
2014 ఎన్నికల్లో మోదీ హవాతో అత్యధిక స్థానాలు సాధించిన బీజేపీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. ఇటీవలే అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ రైతు సంక్షేమ కార్యక్రమాలు, న్యాయ్‌ పథకంతో ఓట్లు రాలతాయని  ధీమాగా ఉంది. «మరోవైపు బీజేపీ మోదీ హవాతోపాటు, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి వాటిపై ఆశలు పెట్టుకుంది.

ఇంకా ఈ రాష్ట్రాల్లోనూ..
అస్సాంలోని మొత్తం నాలుగు స్థానాలకు మంగళవారమే పోలింగ్‌ జరగనుంది.
గోవాలో 2 స్థానాలకు, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానా నికి పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 
కేంద్రపాలిత ప్రాంతాలైన దామన్‌ అండ్‌ దియూ, దాద్రా నగర్‌ హవేలీలోనూ మంగళవారం పోలింగ్‌ జరగనుంది. 

గుజరాత్‌: మోదీ మేజిక్‌ రిపీట్‌!
2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలను గెలిచి బీజేపీ రికార్డు సృష్టించింది. ప్రధానిగా మోదీ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన సొంత రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం (77) పుంజుకుంది. మునుపటి కంటే 16 స్థానాలు ఎక్కువ గెలుచుకుంది. ఈ అదనపు సీట్లన్నీ ఆదివాసీల ప్రాబల్యం ఉన్న సౌరాష్ట్ర ప్రాంతంలోనివి. అసెంబ్లీలో 150 స్థానాలు గెలుచుకుంటామన్న బీజేపీ.. అత్తెసరుగా 99 స్థానాలకు పరిమితమైంది. అయినా కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి 8 శాతం ఎక్కువ ఓట్లు ఉండటాన్ని చూస్తే కాషాయదళాన్ని తక్కువ అంచనా వేయలేమని స్పష్టమవుతోంది. 1990 నుంచి బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని పెంచుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 11 శాతం క్షత్రియులు కాగా, 12 శాతం మంది పాటీదార్లు ఉన్నారు. వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వారు 40 శాతం వరకూ ఉంటే దళితులు 7, ఆదివాసీలు 14, ముస్లింలు 9 శాతం ఇతర సామాజిక వర్గాల వారు ఏడు శాతం ఉన్నారు. జనాభా పరంగా అత్యధికులైన ఓబీసీల్లో 22 శాతం కోలీలు, 20 శాతం ఠాకూర్లు. మిగిలిన వారందరూ చిన్న చిన్న సామాజిక వర్గాల వారు. పాటీదార్లతోపాటు ఓబీసీలు, బ్రాహ్మణుల మద్దతుతో బీజేపీ వరుస విజయాలు సాధించింది. క్షత్రియ, హరిజన, ఆదివాసి, ముస్లింల మద్దతుతో కాంగ్రెస్‌.. బీజేపీకి సమవుజ్జీగా నిలవలేకపోయింది. 2017లో గ్రామీణ ప్రాంతాల్లోని అసంతృప్తి, వ్యవసాయ సంక్షోభాన్ని అంచనా వేయడంలో విఫలమైన బీజేపీ కష్టమ్మీద మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంది. పాటీదార్లను హార్దిక్‌ పటేల్, ఓబీసీలను అల్పేశ్‌ ఠాకూర్, దళితులను జిగ్నేశ్‌ మేవానీ తమ వైపు తిప్పుకోవడంతో బీజేపీ బలహీనపడింది. 

ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే..
గుజరాత్‌లో కాంగ్రెస్‌ కొంత బలహీనపడుతూ వచ్చింది. సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో చేరిన పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ పోటీకి సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పడం పరిస్థితి మరింత దిగజారేలా చేసింది. పైగా అల్పేశ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి మోదీ, గుజరాత్‌ ఆత్మ గౌరవం, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు వంటి అంశాలతో ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా గాంధీనగర్‌ నుంచి పోటీ చేస్తుండటం కొంత కలిసొచ్చే అంశం. రైతులకు ప్రత్యేక బడ్జెట్, రుణమాఫీ వంటి హామీలు గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశముంది. 

బీజేపీ–కాంగ్రెస్‌ నువ్వా?నేనా?
షెడ్యూల్డ్‌ తెగలకు కేటాయించిన నాలుగు స్థానాలు (ఛోటా, ఉదయ్‌పూర్, దహోద్, బర్దోలి, వల్సాడ్‌)లో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఇక్కడున్న 27 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని మాత్రమే గెలుచుకోగలగడం ఇందుకు ఒక కారణం. పైగా నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, అటవీ హక్కులు, సాగునీరు వంటి అంశాల్లో ఆదివాసీలు కేంద్రంపై అసంతృప్తిగా ఉన్నారు. 
అమ్రేలిలో బీజేపీ – కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పరేశ్‌ ధన్నాని.. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ నారన్‌ కచ్చాడియాకు గట్టి పోటీ ఇస్తున్నారు.
జునాగఢ్‌లో సిట్టింగ్‌ ఎంపీ రాజేశ్‌ చుడాసమా – కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పుంజా వంశ్‌ పోటీ పడుతున్నారు. ఈ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్‌వే. పాటీదార్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం దీనికి కారణం.
ఆనంద్, సురేంద్రనగర్, పోర్‌బందర్, బనాస్‌ కాంతా, సబర్‌కాంతా, మెహసానా, పటాన్‌లో గెలుపు అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ అంచనా. 

>
మరిన్ని వార్తలు