భువనగిరి పోరులో మిగిలింది 13 మందే

29 Mar, 2019 14:30 IST|Sakshi
నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్న శ్రీనివాస్, ఉపసంహరణ పత్రాన్ని తీసుకుంటున్న శోభారాణి

సాక్షి, యాదాద్రి : లోక్‌సభ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం భువనగిరి లోక్‌సభ స్థానానికి 13 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజైన గురువారం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముం దుగా 34 మంది అభ్యర్థులు 59 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో 11 తిరస్కరించారు. ఇక రంగంలో 23 మంది మిగిలారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం విధించిన రెండురోజుల గడువు నేటితో ముగియడంతో 10 మంది తమ నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్నారు. 15 మంది అభ్యర్థులకు మించితే రెండో బ్యాలెట్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. కానీ చివరకు 13 మంది అభ్యర్థులు ఒక నోట బటన్‌ ఉండడంతో ఒక బ్యాలెట్‌ యూనిట్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ పార్టీలకు వాటి ఎన్నికల గుర్తులు ఇవ్వనుండగా ఇండిపెండెంట్లకు ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన  గుర్తులను కేటాయించి బ్యాలెట్‌ పత్రాలను తయారు చేసి ఈవీఎంలలో అమరుస్తారు. ఏప్రిల్‌ 11న ఎంపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  

ఫలించిన ఉపసంహరణ ప్రయత్నాలు 
23 మంది రంగంలో ఉండగా 10 మంది అభ్యర్థుల చేత నామినేషన్లను ఉపసంహరించడంలో రాజకీయపార్టీల ప్రయత్నాలు ఫలించాయి. 15 మంది అభ్యర్థులు దాటితే  రెండో బ్యాలెట్‌ యూనిట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓటర్లు తికమకపడి తమకు పడే ఓటు చిత్తు కావడం, లేదా మరొకరికి పడే అవకాశం ఏర్పడి  తమకు నష్టం కలుగుతుందన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో  నెలకొంది. అయితే ఈ విషయంలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులను రంగంలోంచి ఉపసంహరించుకునే విధంగా చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఉపసంహరణ చేసుకున్న వారికి తగిన పారితోషికం భారీగానే ముట్టినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు