వీహెచ్‌పీని చీల్చేందుకు తొగాడియా వ్యూహం

23 Jan, 2018 17:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి ప్రవీణ్‌ తొగాడియాను తొలగించేందుకు ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తుండగా, ఆయన విశ్వ హిందూ పరిషత్‌నే చీల్చేందుకు, తద్వారా సంఘ్‌ పరివార్‌లో కొత్త సమీకరణలకు తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుయాయులు తెలియజేస్తున్నారు.

గత వారం కొన్ని గంటలపాటు అదృశ్యమైన ప్రవీణ్‌ తొగాడియా హఠాత్తుగా ఆస్పత్రిలో ప్రత్యక్షమవడం, తనను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించడం తెల్సిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రవీణ్‌ తొగాడియా ఓ పుస్తకం రాస్తున్నారని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో రామాలయం నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందులో విఫలమైనట్లు తొగాడియా ఆరోపించారని, అందుకని వీహెచ్‌పీ పదవి నుంచి ఆయన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలోనే తనను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని తొగాడియా ఆరోపించారు. తనను పదవి నుంచి తొలగించక ముందే విశ్వ హిందూ పరిషత్‌లో తన వర్గీయులతో కలసి విడిపోవాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల నినాదం చేసుకొని లబ్ధి పొందాలని ఆశిస్తున్న మోదీ–బీజేపీ వ్యూహాన్ని ముందుగానే దెబ్బగొట్టాలని కూడా తొగాడియా యోచిస్తున్నారట.

అందుకని తక్షణమే రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమం చేపట్టాలని, తద్వారా హిందూ పరివారంలో కొత్త సమీకరణలకు తెర తీయాలని ఆయన వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ప్రవీణ్‌ తొగాడియాతో శ్రీరామ్‌ సేన నాయకుడు ప్రమోద్‌ ముతాలిక్, ఉత్తర గుజరాత్‌ వీహెచ్‌పీ నాయకుడు అశ్విన్‌ భాయ్‌ పటేల్‌ తదితరులు సమావేశమవడం ఆయన భవిష్యత్‌ వ్యూహాన్ని సూచిస్తోంది.

సంక్షోభం నివారణలో భాగంగా  2002లో హిందువులను, వీహెచ్‌పీ, భజరంగ్‌ దళాలను టార్గెట్‌ చేసిన గుజరాత్‌ పోలీసులు ఇప్పుడు డాక్టర్‌ ప్రవీణ్‌ తొగాడియాను టార్గెట్‌ చేశాయని ఆరోపించారు. ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు కలిగిన స్వామి చిన్మయానంద లాంటి వాళ్లు తొగాడియాలను తొలగించాలనే కోరుకుంటున్నారు. ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవాలని వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌లు భావిస్తున్నారు. వీహెచ్‌పీ కార్యదర్శి సురేంద్ర జైన్‌ కూడా తొగాడియాను కలుసుకొని మంతనాలు జరిపారు.

మరిన్ని వార్తలు