నిరసన తెలిపే హక్కునూ కాలరాస్తున్న ప్రభుత్వం

1 Apr, 2019 08:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : కేఎస్‌గా చిరపరిచితులైన కలగర సాయి లక్ష్మణరావు పాతికేళ్లపాటు గుంటూరు హిందూ కాలేజీలో పాలిటికల్‌ సైన్స్‌ బోధించారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను లోతుగా విశ్లేషించగల సామర్థ్యం ఆయన సొంతం. ఆయన దగ్గర క్లాస్‌రూంలో కూర్చుని చదువుకున్నా, చదువుకోకపోయినా.. గుంటూరులో అనేక బ్యాచ్‌ల విద్యార్థులు ఆయన్ను ‘గురువు గారూ’ అని గౌరవంగా పిలుచుకుంటారు. పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ప్రస్తుత వ్యవస్థపై లక్ష్మణరావు ఏం చెబుతున్నారంటే... 

నిరసనల్ని ప్రభుత్వం అడ్డుకుంటోంది 
నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న హక్కు. దాన్ని కూడా కాలరాసిన ప్రభుత్వం ఇది. విజయవాడలో ధర్నా చౌక్‌కు బయలుదేరిన వారిని చాలా సందర్భాల్లో అక్కడకు వెళ్లకుండానే నిర్బంధిస్తున్నారు. తెల్లారకముందే పోలీసులు ఇంటికి వచ్చి గృహ నిర్బంధం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులును సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య. సీపీఎస్‌ రద్దు అంశం రాజకీయ అజెండాగా మారింది. సీపీఎస్‌ రద్దు చేయమని రెండేళ్ల నుంచి ఉద్యమం నడుస్తోంది. రద్దు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అంటే.. సీపీఎస్‌ అంశం మీద చర్చ జరుగుతుందనే కదా! రద్దు చేయమన్నందుకు వారి సంఘం అధ్యక్షుడిని సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తున్నా.  

ఓటర్లకు ఒకటే చెబుతున్నా.. 
అన్ని పార్టీలను పరిశీలించండి. చేసిన వాగ్దానాలను నిజాయితీగా ఎవరు అమలు చేస్తారని భావిస్తారో.. వారికే ఓటేయండి. ధన ప్రభావానికి, ప్రలోభాలకు గురికాకుండా.. అభ్యర్థుల గుణగణాలు, సేవాతత్పరతను పరిశీలించి ఓటు వేయండి. ఉత్తమ సమాజానికి దోహదపడే విధంగా మన ఓటు ఉండాలని ప్రతి ఒక్కరూ భావించాలి. 

విద్య పేదలకు దూరమవుతోంది 
కార్పొరేట్‌ శక్తులు ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. రాజకీయాలనూ కార్పొరేటీకరణ చేశారు. విద్యావ్యవస్థ విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో విద్యారంగం తీవ్ర స్థాయిలో కార్పొరేటీకరణ జరిగింది. ఈ స్థాయిలో కార్పోరేటీకరణ జరిగిన రాష్ట్రాలు దేశంలో లేవు. దీనివల్ల పేదలకు నాణ్యమైన విద్య దూరమైపోతోంది. ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉండకూడదు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలి. కేరళ, ఢిల్లీలో సర్కారు పాఠశాలలను ఆధునికీకరించి.. కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లారు. ఏపీలోనూ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా.. ఆకర్షణీయంగా ఉండేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను అన్నివిధాలుగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు వేలల్లో ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని అలహాబాదు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలైతే మంచి ఫలితాలు వస్తాయి. 

ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలి 
ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ధన, కుల, మతం, మద్యం, ఇతర ప్రలోభాల ప్రభావం లేకుండా సంస్కరణలు తీసుకురావాలి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పట్టభద్రులు ఓట్లేశారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇది రావాలి.

– మల్లు విశ్వనాథ్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో   

మరిన్ని వార్తలు