‘బాబు కాపులను నమ్మించి మోసం చేశారు’

28 Jun, 2020 18:44 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైఎస్సార్‌సీపీ నేత తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మోసం చేయడంతో ప్రజలు 151 సీట్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే 45 నుంచి 60 ఏళ్లు ఉన్న కాపు మహిళలకు ఆర్థిక సాయం చేశామని తెలిపారు. 2.40 లక్షల మంది కాపు మహిళలకు కాపు నేస్తం అందించామని చెప్పారు. ఇంకా అర్హత ఉన్నవారు నమోదు చేసుకునేందుకు నెల సమయం కూడా ఇచ్చామని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్‌కళ్యాణ్ అదే చెప్పారని ఎద్దేవా చేశారు.(అవన్నీ పవన్‌కు కనిపించడం లేదా: అవంతి)

2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి జనసేన తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని తోట త్రిముర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెపప్పారు. ముద్రగడ ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా లేని విధంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని ధ్వజమెత్తారు. కంచం కొడితే కూడా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, గాజువాకలో కూడా కాపులే ఎక్కువగా ఉన్నాపవన్ కల్యాణ్‌ను ఓడించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తనలోని లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కాపులకు పూర్తి న్యాయం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని తోట త్రిముర్తులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు