అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్‌

29 Jan, 2020 13:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ విమానంలో వెళుతున్న రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామీని అదే విమానంలో వెళుతూ హేళన చేశారన్న ఆరోపణలపై ప్రముఖ కమేడియన్‌ కునాల్‌ కామ్రపై ఇండిగో మంగళవారం నిషేధం విధించింది. అంటే ఆ విమాన సర్వీసుల్లో ప్రయాణించేందుకు అనుమతించరు. అదే తరహాలో ‘ఎయిర్‌ ఇండియా’ విమాన సర్వీసుల్లో ఆయన్ని అనుమతించమని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్‌ కుమార్‌ మంగళవారం రాత్రి ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమలులో ఉంటోందని ఆయన చెప్పారు. ఇదే దారిలో సాగుతూ స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ అతన్ని బహిష్కరించింది.

మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్‌ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి  పిలుపునిచ్చారు. ‘విమాన ప్రయాణంలో ఇతరులను రెచ్చగొట్టడం, ఇబ్బంది పెట్టడం అనుమతించలేం. అది ఇతరుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది. తోటి ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కమేడియన్‌ కునాల్‌పై చర్య తీసుకోవాల్సిందిగా పిలుపునివ్వక తప్పడం లేదు’ అని హర్దీప్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

2016, జనవరి 17వ తేదీన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో కుల వివక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేముల తల్లి రాధికా వేములను ఉద్దేశించి ఆర్నాబ్‌ స్వామి తన షోలో ఆమె కులం ఏమిటంటూ అవమానించారు. ఈ విషయమై విమానంలో కనిపించిన ఆర్నాబ్‌ను కునాల్‌ నిలదీశారు. దానికి ఆయన స్పందించకుండా చెవుల్లో ఇయర్‌ ఫోన్లు పెట్టుకొని లాప్‌టాప్‌తో బిజీ ఉండేందుకు ప్రయత్నించగా ఆయన జాతీయవాదాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవడంతో కునాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. కునాల్‌ తన కామిడీ షోలలో అధికార పక్షం కుహనా దేశభక్తిపై జోకులు వేస్తున్నందుకే ఆయనపై ఈ అనుచిత చర్య తీసుకున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు