ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం

20 Aug, 2019 03:51 IST|Sakshi
మోపిదేవి, చల్లా, ఇక్బాల్‌

కౌన్సిల్‌కు మోపిదేవి వెంకటరమణ,చల్లా, ఇక్బాల్‌ ఎన్నిక

అధికారికంగా ప్రకటించిన రిటర్నింగ్‌ అధికారి

సాక్షి, అమరావతి: శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్‌ ఇక్బాల్‌ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి (లెజిస్లేచర్‌ కార్యదర్శి–ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులు సోమవారం సాయంత్రం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల నాని, టీడీపీకి చెందిన కరణం బలరాం తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన ఫలితంగా ఏర్పడిన ఖాళీలకు ఇటీవల విడివిడిగా ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

శాసనసభలో వైఎస్సార్‌సీపీకి సంఖ్యాపరంగా పూర్తి ఆధిక్యత ఉండటం, మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్‌ను దాఖలు చేయకపోవడంతో  ఏకగ్రీవంగా ముగ్గురూ ఎన్నికయ్యారు. కోలగట్ల రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చి 29, 2021 వరకూ (ఒకటిన్నర ఏడాది), నాని, బలరాం రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29, 2023 వరకూ (మూడున్నర ఏళ్లు) ఉంది. ఒకటిన్నర ఏడాది పదవీ కాలానికి మహ్మద్‌ ఇక్బాల్, మూడున్నర ఏళ్ల పదవీ కాలానికి మోపిదేవి, చల్లా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మండలిలో వైఎస్సార్‌సీపీ బలం 9 మందికి పెరిగింది.

ధృవీకరణ పత్రాలు తీసుకున్న ఇక్బాల్, చల్లా
మహ్మద్‌ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి తమ ఎన్నిక ధృవీకరణ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి బాలకృష్ణమాచార్యులు నుంచి తీసుకున్నారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు వారు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా నదీ వరదల్లో బాధితుల కోసం చేపట్టిన సహాయక చర్యల్లో మంత్రి మోపిదేవి నిమగ్నమై ఉండటంతో ఆయన ధృవీకరణ పత్రం తీసుకోలేదు. 

వచ్చే ఏడాది మరో రెండు ఖాళీలు
గవర్నర్‌ నామినేట్‌ చేసే కోటాలో వచ్చే ఏడాది (2020) మార్చి 2 నాటికి శాసనమండలిలో మరో రెండు ఖాళీలు ఏర్పడతాయి. ఈ రెండు స్థానాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్‌ నియామకం చేస్తారు. స్థానిక సంస్థల కోటాలో అనంత, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థానిక సంస్థల పాలక వర్గాలు లేవు కనుక ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 

మరిన్ని వార్తలు