హ్యాట్రిక్‌ వీరులు ముగ్గురే..

30 Mar, 2019 13:29 IST|Sakshi
హరీశ్‌చంద్ర హెడా , ఎం.రాంగోపాల్‌రెడ్డి, కేశ్‌పల్లి గంగారెడ్డి

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎంపీలుగా ఎని మిది మంది విజయం సాధించగా అందులో హ్యాట్రిక్‌ సాధించిన వారు ముగ్గురే ఉన్నారు. ఈ స్థానానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 17వ ఎన్నికల జరుగనుంది. తొలి ఎంపీగా విజయం సాధించిన హరీశ్‌చంద్ర హెడా మూడుసార్లు ఎంపీగా ఎంపికై రికార్డును సృష్టించారు. 1952, 1957,1962లలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగగా హరీశ్‌చంద్ర హెడా వరుసగా ఎంపీగా గెలుపొందారు.

ఆయన తరువాత ఎం.రాంగోపాల్‌రెడ్డి 1971, 1977, 1980లలో వరుసగా విజయం సాధించి హరీశ్‌చంద్ర హెడా రికార్డును చేరుకున్నారు. 1991లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈయన 1998, 1999లలో కూడా ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎంపీగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. హ్యాట్రిక్‌ సాధించిన ఎంపీలలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కాగా కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ తరపున బరిలో నిలిచి ఎంపీ అయ్యారు.

తాడూరి బాలాగౌడ్, మధుయాష్కిగౌడ్‌లు మాత్రం రెండుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మధుయాష్కి గౌడ్‌ 2014లోనూ పోటీ చేసి హ్యాట్రిక్‌ సాధించాలని ఆశించినా టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ కవిత చేతిలో ఓటమిపాలై హ్యాట్రిక్‌ రికార్డును చేరుకోలేక పోయారు. నారాయణరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డిలు ఒకేసారి ఎంపీలుగా తమ బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కవిత రెండోసారి పోటీ చేస్తుండగా మధుయాష్కిగౌడ్‌ నాలుగోసారి, ధర్మపురి అర్వింద్‌ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాగా స్వతంత్రులుగా రైతులు 178 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఎవరికి ఎలాంటి రికార్డు లభిస్తుందో వేచి చూడాలి.  

మరిన్ని వార్తలు