ఓ నియోజకవర్గం.. ముగ్గురు తొలి ఎమ్మెల్యేలు..

18 Mar, 2019 13:47 IST|Sakshi
కొండూరు మారారెడ్డి, పంజం నరసింహారెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

ఉమ్మడి నియోజకవర్గం నుంచి సీపీఐ ఎమ్మెల్యే

ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత మారారెడ్డి

పునర్విభజన అనంతరం ఆకేపాటి 

సాక్షి, రాజంపేట: ఒక నియోజకవర్గానికి ఒకరే తొలి ఎమ్మెల్యే ఉంటారని అందరికీ తెలుసు.. కానీ రాజంపేట నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నారు. 1952లో రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గంగా ఉన్నప్పుడు పంజం నరసింహారెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి నియోజకవర్గ చరిత్రలో ఆయన తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని అనంతరాజంపేట గ్రామ పంచాయతీలోని తంబల్లవారిపల్లెకి చెందిన ఈయన పేరొందిన కమ్యూనిస్టు నేత. కేవలం భూమి ఉన్న వారికే ఓటు హక్కు ఉన్న రోజుల్లో.. ఆయన ఓ సంచి తగిలించుకొని గ్రామగ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే వారు. కమ్యూనిస్టు పార్టీ మొదటి జిల్లా కార్యదర్శిగా పని చేశారు. 1913లో పుట్టి, 1964లో మరణించారు. స్వాతంత్య్రసంగ్రామంలో దేశం కోసం పాల్గొంటూనే.. ప్రజల సమస్యలపై కమ్యూనిస్టుగా పోరాటాలను చేశారు. 

కొండూరు మారారెడ్డి
ఉమ్మడి నియోజకవర్గం నుంచి రాజంపేట  వేరైంది. 1962లో  జరిగిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పెనగలూరు మండలంలోని కొండూరుకు చెందిన కొండూరు మారారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఈయన గుర్తు నక్షత్రం. మంచికి మారుపేరుగా.. పేదలంటే అభిమానం, ఆప్యాయతలను చూపే ఆయన పట్ల ప్రజలు ఎనలేని అభిమానం చూపే వారు. అందుకే ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత మారారెడ్డి స్థానంలో ఆయన సతీమణి కొండూరు ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాజంపేట నియోజకవర్గంలో తనదైన శైలిలో రాణించారు. ఇప్పుడు వారి సొంత మండలం పెనగలూరు రైల్వేకోడూరు నియోజకవర్గంలోకి చేరిపోయింది.

పునర్విభజన తర్వాత ఆకేపాటి
రాజంపేట, పెనగలూరు, ఒంటిమిట్ట, నందలూరు మండలాలతో ఉన్న రాజంపేట నియోజకవర్గం.. నియోజకవర్గాల పునర్విభజనతో రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలతో రాజంపేట నియోజకవర్గంగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రాజంపేట రాజకీయ చరిత్రలో తొలి ఎమ్మెల్యేగా నిలిచిపోయారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఆకేపాటి చరిత్రకెక్కారు. దివంగత సీఎం వైఎస్సార్‌ కుటుంబంతో అనుబంధం కలిగిన ఆకేపాటి అంచలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చినప్పుడు.. ఆయనకు అండగా నిలబడిన తొలి ఎమ్మెల్యే ఆకేపాటి. వైఎస్సార్‌ హయాంలో జిల్లా అధ్యక్షుడిగాను, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.  

మరిన్ని వార్తలు