మోదీకి సవాలు విసురుతున్న ముగ్గురు మహిళలు

2 Feb, 2019 17:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలను ఎదుర్కొనున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటివరకు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ వంటి నేతలతో పోటీ పడిన మోదీ... రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బలమైన ముగ్గురు మహిళా నేతలను ఢీకొననున్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ప్రియాంక గాంధీలు ఎన్నికల రంగంలో మోదీకి సవాలు విసురుతున్నారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మమతా బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు విపక్షాలతో చర్చలు జరిపిన దీదీ.. ఇటీవల బెంగాల్‌ వేదికగా విపక్ష పార్టీలతో భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలంటే బెంగాల్‌లో తృణమూల్‌ను ఢీకొనక తప్పదు.

దీంతో మమత నుంచి మోదీ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. బెంగాల్‌లో మొన్నటి వరకు వామపక్షాలు, తృణమూల్‌ మధ్య జరిగిన వార్‌ ఇప్పుడు బీజేపీ, తృణమూల్‌ మధ్య నువ్వా నేనా అనే విధంగా సాగుతోంది. బెంగాల్‌లో పట్టుసాధించాలంటే మమతకు చెక్‌ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు బెంగాల్‌లో స్థానం లేదంటూ మమత విమర్శల దాడిని ఉధృతం చేశారు. ఫలితంగా బీజేపీ, తృణమూల్‌ మధ్య పోరు ఆసక్తిగా మారింది.

ఎన్నికల వేళ బీజేపీకి సవాలు విసురుతున్న మరో బలమైన మహిళా నేత బీస్పీ అధినేత్రి మాయావతి. కీలకమైన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు పొత్తుపెట్టుకుని బీజేపీని ఢీకొనేందుకు సిద్ధమైయ్యాయి. దళితులు, బీసీల ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న యూపీలో మాయావతి ప్రభావం చాలామేరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరూ కలవడం వల్ల బీజేపీకి కొంత నష్టం తప్పదని చెప్తున్నారు. యూపీలో పాటు, బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల్లో బీఎస్పీకి కొంతపట్టుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో మాయావతిని బీజేపీ ఎదుర్కొవాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా మోదీపై విమర్శల దాడి చేయడంలో మాయా, మమత తీవ్రంగా పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో వీరిద్దరు కలిస్తే మోదీకి కష్టమేనని విశ్లేషకుల మాట.

ఇక లోక్‌సభ ఎన్నికల ముందు మెరుపులా వచ్చిన కాంగ్రెస్‌ తురుపు ముక్క ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల రణరంగంలో సై అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి విశిష్టమైన స్థానముంది. ఇందిరా, సోనియా తరువాత గాంధీ కుంటుంబం నుంచి వచ్చిన మరో మహిళా నేత ప్రియాంక. కీలమైన ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సంధించిన బాణంగా ప్రియాంక ఎంట్రీని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు రాహుల్‌, సోనియా సభల్లోనే పాల్గొన్న ప్రియాంక.. మోదీని ఢీకొట్టేందుకు ప్రత్యక్ష రాజకీయల్లోకి దూసుకువచ్చారు. కీలకమై యూపీలో పార్టీ బాధ్యతలను ఆమె చేపట్టనున్నారు. ఇలా ముగ్గురు బలమైన మహిళా నేతలను లోక్‌సభ ఎన్నికల ముందు నరేంద్ర మోదీ ఎదుర్కొవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వారు ఏ మేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు